iDreamPost
android-app
ios-app

మొఘల్ వంశం అంతరించిన రోజు

మొఘల్ వంశం అంతరించిన రోజు

భారతదేశ చరిత్రలో అతి సుదీర్ఘ కాలం, దేశంలో ఎక్కువ భాగాన్ని పాలించిన వారు మొఘలులు. 1526లో మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోఢీని, మధ్య ఆసియా ప్రాంతమైన సమర్ఖండ్ నుంచి వచ్చిన బాబర్ ఓడించడంతో ఆరంభమైన మొఘల్ పాలన అతడి కుమారుడు హుమాయూన్ షేర్షా సూరి చేతిలో ఓడిపోవడంతో ఏర్పడిన పదిహేను సంవత్సరాల అంతరాయం తరువాత, షేర్షా కొడుకు సికిందర్ షా మీద గెలిచి మొఘల్ సామ్రాజ్యాన్ని పునరుద్దరించిన తరువాత దాదాపు రెండు శతాబ్ధాల పాటు దినదిన ప్రవర్ధమానమై, ఔరంగజేబ్ మరణంతో క్రమేపీ క్షీణించడం మొదలై నవంబర్ 7,1862న ఆఖరు మొఘల్ చక్రవర్తి రెండవ బహదూర్ షా జాఫర్ మరణంతో అంతరించింది.

పతనానికి కారణాలెన్నో

బలమైన మొఘల్ సామ్రాజ్యం పతనం కావడానికి చరిత్రకారులు అనేక కారణాలు చెప్తారు. ఒకవైపు మరఠాలు, మరోవైపు సిక్కులు బలపడడం, మరోవైపు అనేకమంది బలమైన సామంతరాజులు స్వతంత్రం ప్రకటించుకోవడం, అధికారం కోసం మొఘల్ వారసులలో అంతర్యుద్ధాలు, ఔరంగజేబు తరువాత బలమైన వారసులు లేకపోవడం, అదే సమయంలో బ్రిటిష్ వారు తమ అధికారాన్ని భారతదేశమంతా విస్తరించడంతో మొఘల్ ప్రాభవం క్షీణించుకుపోయింది.

పందొమ్మిదవ శతాబ్దం మొదటి నాటికే మొఘల్ సామ్రాజ్యం కుంచించుకు పోయింది. “సార్వభౌముడు షా ఆలం – పాలించేది ఢిల్లీ నుంచి పాలం” అని అప్పటి పాలకుడు రెండవ షా ఆలం గురించి వెటకారంగా చెప్పుకునేవారు. పాలం అనేది ఢిల్లీ సరిహద్దు ప్రాంతం. అంటే అప్పటి మొఘల్ పాలన ఢిల్లీకి పరిమితమైపోయింది. మరాఠాలను బ్రిటిష్ వారు ఓడించి ఢిల్లీని ఆక్రమించుకున్న తరువాత మొఘల్ పాలన ఎర్రకోటకు పరిమితమైపోయింది.

నామమాత్రమైన అధికారం

1837లో తండ్రి రెండవ అక్బర్ మరణం తరువాత అధికారం చేపట్టిన రెండవ బహదూర్ షా జాఫర్ పేరుకే చక్రవర్తి. పాలన అంతా కలకత్తా లోని బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన రెసిడెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నడిచేది. బ్రిటిష్ వారు నెలనెలా ఇచ్చే పెన్షన్ తో చక్రవర్తి తన ఆస్థానం నడిపేవాడు. సహజంగా కవి అయిన బహదూర్ షా కవిత్వం రాసుకుంటూ, తన పెన్షన్ లోనుంచి జీతం ఇచ్చి నియమించిన ఆస్థాన కవులు, గాయకులు, ఆంతరింగికులతో కవిత్వం మీద, ఇస్లాం మీద చర్చలతో కాలం వెల్లదీస్తూ, శరీరంలో ఓపిక ఉండగానే మక్కా వెళ్లి, అక్కడ ప్రాణం వదలాలి అన్న ఆశతో జీవిస్తూ ఉండేవాడు.

1852లో కొడుకు పెళ్ళి చేసినప్పుడు ఊరేగింపులో వాడే గుర్రాలు, ఏనుగుల అద్దెకి, టపాకాయలకి, ఇతర కర్చులకి నగరంలోని వ్యాపారస్తుల వద్ద అప్పు చేయాల్సి వచ్చింది బహదూర్ షాకి. చక్రవర్తి అప్పు తిరిగి ఇవ్వలేదని తెలిసీ, అతని పూర్వీకులు తమ పూర్వీకులకు చేసిన సహాయాలను మనసులో పెట్టుకుని ఆ వ్యాపారస్తులు అప్పు ఇచ్చారు.

విధి ఆడిన నాటకం – సిపాయీల తిరుగుబాటు

1857 మే నెలలో మీరట్ నగరంలో మొదలైన సిపాయీల తిరుగుబాటు బహదూర్ షా జాఫర్ జీవితంలో పెనుతుఫాను సృష్టించింది. తిరుగుబాటు చేసిన సైనికులు తమ పై అధికారులను, ఇతర ఆంగ్లేయులను చంపి, నేరుగా ఢిల్లీ వచ్చారు. బహదూర్ షా వద్దకు వచ్చి, విషయం చెప్పి, “బ్రిటిష్ పాలన అంతం చేసి, మొఘల్ పాలన పునరుద్ధరణ చేస్తాం. మీరే మా నాయకుడు” అన్నారు. “బాబూ, రేపు బ్రిటిష్ సైనిక దళాలు వస్తాయి. మిమ్మల్ని, నన్నూ చంపేస్తారు. ఎనభై ఏళ్ళ వయసులో నాకు అధికారం మీద ఆశ లేదు. నన్ను వదిలేయండి” అన్న బహదూర్ షా పీక మీద కత్తి పెట్టి నాయకుడిగా ఉండడానికి ఒప్పించారు తిరుగుబాటు సైనికులు.

తిరుగుబాటు సంగతి తెలిసి ఉత్తర భారత దేశంలో అనేక చోట్ల ఉన్న ఆర్మీ రెజిమెంట్లలో భారత సిపాయీలు తిరుగుబాటు చేసి, బ్రిటిష్ అధికారులను చంపి, నేరుగా ఢిల్లీ వచ్చేశారు. అలాగే మొఘల్ పాలన పునరుద్ధరణ అయ్యే అవకాశం గమనించిన అనేక మంది ముస్లిం జిహాదీలు కూడా పోరాటంలో తమవంతు పాత్ర పోషించడం కోసం ఢిల్లీ చేరారు. ఆ సైన్యాన్ని చూసి మళ్ళీ తమ పూర్వీకుల వైభవం తాను కూడా అనుభవించగలనేమో అన్న ఆశ బహదూర్ షాలో అంకురిస్తూ ఉన్న సమయంలో, 1857 సెప్టెంబరులో దేశం నలుమూలలా ఉన్న బ్రిటిష్ సైన్యం ఏకమై ఢిల్లీ మీద దాడి చేసి తిరుగుబాటు అణచివేసి, తిరుగుబాటుదారులందరినీ ఉరి తీశారు.

బ్రిటిష్ కోర్టు విచారణ జరిపి, బహదూర్ షాకి దేశాంతరవాసం శిక్ష విధించారు. తన భార్యలలో ఇద్దరు, కుమారుల్లో ఇద్దరూ, కొందరు సేవకులు వెంటరాగా అందరినీ బర్మాలోని రంగూన్ నగరానికి తరలించి అక్కడ గృహనిర్బంధం చేశారు. బహదూర్ షా కుమారులలో కొందరు సిపాయీలతో కలిసి పోరాటం చేసి చనిపోగా మరికొందరిని బ్రిటిష్ వారు చంపేశారు.

రంగూన్ లో గృహ నిర్బంధంలో ఉన్న సమయంలో పూర్తిగా డిప్రెషన్ కి గురయిన బహదూర్ షా ఆరోగ్యం క్రమేపి క్షిణించి 87 సంవత్సరాల వయసులో 1862,నవంబర్ 7వ తేదీ తెల్లవారు జామున మరణించాడు. విషయం రంగూన్ నగరంలోని మహమ్మదీయులకు తెలిస్తే గొడవలు పుడతాయేమోనని భావించిన బ్రిటిష్ అధికారులు ఒక మతపెద్దని పిలిపించి గుట్టుచప్పుడు కాకుండా అదేరోజు సాయంత్రం దగ్గరలోని ఒక ఖాళీ స్థలంలో ఖననం చేశారు. ఆ విధంగా ఘనమైన మొఘల్ వంశపు ఆఖరి వారసుడు అనామకంగా అంతమయ్యాడు.

ఆ తర్వాత ఆయన ఇద్దరు భార్యలు, కుమారులకు నెలనెలా పెన్షన్ అందే ఏర్పాటు చేసి, గృహనిర్బంధం నుంచి విముక్తి కలిగించారు. ఆ కొద్దిపాటి పెన్షన్ తో నగరంలో ఒక మూల పాకల్లో జీవితం కొనసాగించిన భార్యలు దీనావస్థలో మరణించారు. జవాన్ భక్త్ అనే కొడుకు మద్యానికి బానిసగా మారి చిన్న వయసులోనే జబ్బు పడి మరణించాడు. షా అబ్బాస్ అనే మరో కుమారుడు స్థానికంగా ఉన్న ఒక వ్యాపారి కూతురుని పెళ్ళి చేసుకున్నాడు. అతని వారసుల రూపంలో మొఘల్ వంశం నేటికీ అనామకంగా బర్మాలో బ్రతికి ఉంది.