iDreamPost
android-app
ios-app

వాక్సీన్ వచ్చే వరకూ కరోనాతో ప్రమాదమే!!

వాక్సీన్ వచ్చే వరకూ కరోనాతో ప్రమాదమే!!

బాక్టీరియా లేదా వైరస్ వల్ల వచ్చే జబ్బులు మహమ్మారిలా వ్యాపించినప్పుడు సరైన ఔషధాలు కానీ టీకాలు కానీ లేనప్పుడు కొంతకాలం మారణహోమం సృష్టించి, ప్రభావం కోల్పోయి, శాంతించడానికి కారణం Herd Immunity. తెలుగులో మంద/మూక/గుంపు రోగనిరోధక శక్తి.

జనాభాలో అధిక శాతం మంది జబ్బు బారిన పడ్డాక, మరణించిన వారు పోగా మిగిలిన వారిలో ఆ బాక్టీరియా లేదా వైరస్ తో పోరాడగలిగే యాంటీబాడీలు తయారయి, మరలా ఆ జబ్బు బారిన పడకుండా రక్షణ లభిస్తుంది.

వాక్సీన్ చేసే పని కూడా ఇదే. అయితే ఇక్కడ జబ్బు బారిన పడకుండా రక్షణ లభిస్తుంది. జబ్బు కలిగించే బాక్టీరియా లేదా వైరస్ మృత కణాలను (killed) కానీ, ప్రభావం లేకుండా నిర్వీర్యం చేసిన జీవ కణాలను (live attenuated) కానీ వ్యక్తి శరీరంలో ప్రవేశపెడితే ఆ వ్యక్తి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఆ బాక్టీరియా లేదా వైరస్ తో పోరాడే యాంటీబాడీలను తయారు చేస్తుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ బాక్టీరియా లేదా వైరస్ ఆ వ్యక్తి శరీరంలో ప్రవేశిస్తే, వెనువెంటనే ఆ యాంటీబాడీలు ఆ సూక్ష్మజీవి మీద దాడి చేసి చంపేస్తాయి.

అయితే సరైన వాక్సీన్ కానీ మందు కానీ లేకపోతే జబ్బు బారిన పడి కోలుకున్న వారిలో కూడా యాంటీబాడీలు తయారయి, మరొకసారి ఆ బాక్టీరియా లేదా వైరస్ శరీరంలో ప్రవేశిస్తే దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. కొన్ని సార్లు కొందరికి ఇన్ ఫెక్షన్ సోకినా దాని ప్రభావం తక్కువగా ఉంటే, లక్షణాలు కనిపించకుండానే జబ్బు నయమైపోతుంది. లక్షణాలు కనిపించవు కాబట్టి ఆసుపత్రికి పోవడం, పరీక్షలు చేయించడం ఉండదు. తనకి జబ్బు సోకిన విషయం కూడా ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు. దీనిని subclinical infection అంటారు. ఇలాంటి వారిలో కూడా యాంటీబాడీలు తయారయి భవిష్యత్తులో ఆ జబ్బు నుంచి రక్షణ కలిగిస్తాయి.

మంద రోగనిరోధక శక్తి

సమాజంలో అరవై శాతం మందిలో ఏదైనా జబ్బుకి సంబంధించిన యాంటీబాడీలు, జబ్బు పడి కోరుకోవడం వల్ల కానీ, వాక్సీన్ వల్ల కానీ ఉంటే, మిగిలిన నలభై శాతం మందికి కూడా ఆ జబ్బు సోకకుండా చాలా వరకు రక్షణ లభిస్తుంది. దీనినే herd immunity అంటారు.

ఇప్పుడు ప్రపంచంలో విలయతాండవం చేస్తూ, సరైన ఔషధం కానీ వాక్సీన్ కానీ లేని కరోనా వైరస్ కూడా కొన్నాళ్ళకు, పొట్టన పెట్టుకున్న వాళ్లు పోగా మిగిలిన వారికి ఈ మంద రోగనిరోధక శక్తి వలన రక్షణ లభిస్తుంది అని శాస్త్రవేత్తలు భావించారు. అయితే ఇటీవల ఈ అంచనా నిజమో కాదో తేల్చడానికి స్పెయిన్ ప్రజల్లో ఒక సర్వే చేశారు కొందరు శాస్త్రవేత్తలు.

స్పెయిన్ దేశం మొదట్లోనే కరోనా బారిన పడింది. జనాభాలో అధికశాతం మంది జబ్బు బారిన పడ్డారు. మరణించిన వారు పోగా మిగిలిన వారిలో గణనీయంగా యాంటీబాడీలు ఉంటాయని ఊహించిన వారికి షాక్ తగిలే ఫలితాలు వచ్చాయి.

మొత్తం జనాభాలో కేవలం 5-6 శాతం మందిలోనే యాంటీబాడీలు ఉన్నాయి. కొంతమందిలో మొదటిసారి పరీక్ష చేసినప్పుడు కనిపించిన యాంటీబాడీలు రెండు వారాల తర్వాత పరీక్ష చేస్తే కనిపించలేదు. అంతేకాకుండా, తక్కువ స్థాయిలో లక్షణాలు ఉన్న వారిలో అసలు యాంటీబాడీల ఉత్పత్తి లేదు. ఈ ఫలితాలను క్రోఢికరిస్తూ కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో మంద రోగనిరోధక శక్తి అన్నది పని చేయదు. వీలయినంత త్వరగా వాక్సీన్ కనుక్కోవడం ఒక్కటే ఈ మహమ్మారితో పోరాటంలో విజయం సాధించే మార్గం అని చెప్పారు.