iDreamPost
android-app
ios-app

వృధ్యాప్య ఫించన్ పథకం రూపకర్త ,మాజీ సీఎం శత జయంతోత్సవాలు

  • Published Feb 14, 2022 | 4:24 AM Updated Updated Mar 11, 2022 | 10:18 PM
వృధ్యాప్య ఫించన్ పథకం రూపకర్త ,మాజీ సీఎం శత జయంతోత్సవాలు

దామోదరం సంజీవయ్య – ఈ స్వతంత్ర భారతదేశంలో సామాజిక న్యాయం అనేది డాక్టర్ అంబేద్కర్ ప్రతిపాదిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దాన్ని అమలు చేసి చూపింది. ఆ క్రమంలో జాతీయ నేతగా గుర్తింపు పొందిన దళిత నేతే దామోదరం సంజీవయ్య. దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి కూడా ఆయనే. అలాగే ఎంతో చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయిన తొలి దళిత నేత కూడా దామోదరం సంజీవయ్య గారే. ఆ తర్వాత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, ద్వితీయ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, ఆ తర్వాత తృతీయ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఇందిరా గాంధీ మంత్రివర్గాల్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాగే ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అంతిమంగా 1960-62 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 

ఆయనను ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినా, ఆంధ్రరాష్ట్రంలో మంత్రిగా చేసినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసినా, కేంద్రంలో ముగ్గురు ప్రధానమంత్రుల మంత్రివర్గాల్లో పనిచేసినా ఆయా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయనను ఒక దళిత నాయకుడుగా కంటే ఒక సమర్ధవంతమైన నేతగా, అందరికీ ఆమోదయోగ్యమైన నేతగా గుర్తించారు. రాష్ట్రంలో అప్పటి సీనియర్ కాంగ్రెస్ నేతలు నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కె వి రంగారెడ్డి వంటి వారిమధ్య ఆధిపత్య పోరులో అందరికీ ఆమోదయోగ్యుడైన సంజీవయ్యను ప్రత్యామ్నాయ నేతగా గుర్తించింది కాంగ్రెస్ నాయకత్వం. అప్పుడే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య. 

రాష్ట్రం నుండి ఢిల్లీకి తీసుకెళ్ళిన కాంగ్రెస్ నాయకత్వం ఆయన సమర్ధత, విశ్వసనీయతను గుర్తించి వరుసగా ముగ్గురు ప్రధాన మంత్రులు తమ మంత్రి వర్గాల్లో కొనసాగించారు. అత్యంత నిరాడంబరుడు అయిన దామోదరం సంజీవయ్య పేరు చెపితే ఇప్పుడు దేశంలో కొన్ని లక్షల మంది అనుభవిస్తున్న వృద్ధాప్య పింఛన్ గుర్తుకు వస్తుంది. ఈ వృద్ధాప్య పింఛన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఒకరోజు తన తల్లిని చూసేందుకు స్వగ్రామం వెళ్ళారు. కుశలప్రశ్నలు అయిన తర్వాత తిరుగు ప్రయాణానికి సిద్ధం అవుతూ తల్లి చేతిలో వంద రూపాయలు పెట్టారు. అప్పుడు ఆ తల్లి “కొడుకువు నువ్వు ఉన్నావు కాబట్టి నాకు ఈ డబ్బులు ఇచ్చావు. పిల్లలు లేని వృద్ధులకు ఎవరిస్తారు?” అంటూ అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానమే వృద్ధాప్య పింఛన్. ఇప్పుడు అది జాతీయ స్థాయిలో ఓ గొప్ప  పథకం అయింది. రాజకీయ పార్టీలకు ఓట్లు సంపాదించుకునే పథకం కూడా అయింది. 

అప్పట్లో దళిత నాయకులకు ఓ విస్తృత లక్ష్యం ఉండేది. వాళ్ళు ఏం అడిగినా, ఏం చేసినా మొత్తంగా తమ జాతి ప్రయోజనాలకోసం ఉండేది. వృద్ధాప్య పింఛన్ దామోదరం సంజీవయ్య ప్రవేశ పెడితే దళిత విద్యార్థులకు వసతి గృహాల (హాస్టల్స్) ప్రవేశపెట్టింది మరో దళిత నేత మాజీ మంత్రి వేముల కూర్మయ్య. ప్రఖ్యాత కాశీ విశ్వవిద్యాలయం నుండి లా పట్టా పొందిన మొదటి దళిత విద్యార్థి వేముల కూర్మయ్య. ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన కాలంలోనే దళిత విద్యార్థులకు హాస్టల్ సదుపాయాలు ప్రారంభించారు. అలాగే దళితులకు వ్యవసాయానికి భూమి, ఇంటిస్థలం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆయనే మొదలు పెట్టారు. 

జాతీయ స్థాయిలో ఇలా కీలక పాత్రలు పోషించిన దామోదరం సంజీవయ్య కానీ, వేముల కూర్మయ్య కానీ ఆ తదుపరి తరం రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి గురయ్యారు. రాష్ట్రంలో ఇతర సామాజిక వర్గాల నేతలకు లభించినంత గుర్తింపు ఈ నేతలకు దక్కలేదు. ఏదో కర్నూలు ప్రాంతంలో దామోదరం సంజీవయ్య విగ్రహం, విజయవాడలో కూర్మయ్య విగ్రహం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేతులు దులిపేసుకుంది. అయితే డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాఖపట్నంలో జాతీయ లా విశ్వవిద్యాలయం, కృష్ణపట్నంలో ధర్మల్ విద్యుత్ కేంద్రాలు దామోదరం సంజీవయ్యకు అంకితం చేసి ఆయన పేరును మరోసారి ఈ తరం ప్రజలకు గుర్తు చేశారు. 

ప్రస్తుతం దామోదరం సంజీవయ్య శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 14న ముగుస్తున్నాయి. ఇప్పటికైనా పాలకవర్గాలు దామోదరం సంజీవయ్యకు సరైన గుర్తింపు కల్పిస్తే ఆయన వంటి ఆదర్శ రాజకీయ నేతలు కొందరైనా తయారవుతారు. 

Also Read : రాయ‌దుర్గంపై చెర‌గ‌ని ముద్ర “పాటిల్‌”