iDreamPost
iDreamPost
తెలంగాణలో కొత్తగా దళిత బంధు పథకాన్ని ప్రారంభిస్తోంది కేసీఆర్ సర్కారు. పేద దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం అందజేస్తామని ప్రకటించింది. ఇందుకు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా కింద ఎంపిక చేసింది. అక్కడ అమలుకు ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేసింది. అంతకుముందే యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో దళిత బంధు సాయాన్ని 76 కుటుంబాలకు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మాకూ ఓ ‘బంధు’ ఇవ్వాలంటూ తెలంగాణలో పలు కులాలు, సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకోసం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పలు చోట్ల నిరసనలు చేస్తున్నాయి. రోజురోజుకూ ఇలాంటి డిమాండ్లు పెరుగుతున్నాయి.
చేనేత బంధు కూడా..
తెలంగాణలో దాదాపు 380 ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, వరంగల్, కరీంనగర్ లలో ప్రధాన చేనేత క్లస్టర్లు ఉన్నాయి. సిరిసిల్ల సహా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది చేనేతపై ఆధారపడి బతుకుతున్నారు. తమకు కూడా రైతు బంధు, దళిత బంధు తరహాలో చేనేతబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే బతుకమ్మ చీరల తయారీ బాధ్యతలు కొన్నేళ్లుగా చేనేతలకే అప్పగిస్తోంది. చేనేతకు చేయూత, చేనేత బీమా కూడా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. 18 నుంచి 59 ఏళ్ల వయసు గల సుమారు 70 వేల మందికి చేనేత బంధు పథకాన్ని వర్తింప చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
బీసీ బంధు కోసం ఆందోళనలు
దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి బీసీ బంధు డిమాండ్ వినిపిస్తోంది. దళితులకు ఇచ్చినట్లే బీసీల్లోని ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని బీసీ సంఘలు కోరుతున్నాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా రంగాల్లో వెనుకబడిన బీసీల సంక్షేమం కోసం బీసీ బంధు పథకం ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌కు వినతిపత్రం కూడా సమర్పించారు. ‘‘కేసీఆర్ సార్.. మేం ఏం పాపం చేశాం. బీసీలకు ఏం లేదా?’’ అని ప్రశ్నిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు ఇటీవల ఫ్లెక్సీలతో నిరసనలు తెలిపారు. తెలంగాణలో ఉన్న 54 శాతం మంది బీసీల్లో అర్హులైన వారందరికీ బీసీ బంధు వర్తింప చేసి కనీసం 20 లక్షల చొప్పున రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రియల్ బంధు ఇవ్వాలంట
ఇప్పుడు కొత్తగా రియల్ బంధు ఇవ్వాలంటూ డిమాండ్ మొదలైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అసోసియేట్ గా, ఏజెంట్ గా ఉన్న పేద మధ్య తరగతి వర్గాల వారందరికీ రియల్ బంధు పథకం అమలు చేయాలని తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రతి కుటుంబానికి రూ.20 లక్షలు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటూ పిలుపునిచ్చింది. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బొంగు వెంకటేశ్ గౌడ్ పేరిట సోషల్ మీడియాలో ఓ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. గతంలో కూడా ప్రభుత్వం తీరుపై రియల్టర్స్ అసోసియేషన్ నిరసనలు తెలిపింది. టీఆర్ఎస్ సర్కారు ప్రకటించిన ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేసింది. సచివాలయ ముట్టడి వంటి కార్యక్రమాలు చేసింది. ఇప్పుడు దళిత బంధు పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంతో తమకూ రియల్ బంధు కావాలని కోరుతోంది.