iDreamPost
iDreamPost
రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. దాదాపు అన్ని పార్టీలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. తమ తమ ఎజెండాల ఆధారంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ పరిధి మేరకు ప్రజలకు చేరువయ్యేయత్నంలో ఉన్నారు. కానీ జనసేనలో మాత్రం నైరాశ్యం కనిపిస్తోంది. కేవలం పత్రికా ప్రకటనలు మినహా ఆపార్టీ కార్యక్రమాలు కనిపించడం లేదు. కార్యకర్తల్లో కూడా ఇది నిరాశకు కారణమవుతోంది. అదినేత ఏపీలో అడుగుపెడితే ఓ కార్యక్రమం, లేదంటే మళ్లీ ఎదురుచూడడమే అన్న చందంగా మారింది. ఇది జనసేన పార్టీని నమ్ముకున్న వారి ఆశలు వమ్ము చేసేలా కనిపిస్తోంది.
తెలుగుదేశం నిత్యం ఏదో వ్యవహారం మీద హడావుడి చేస్తోంది. తమకున్న ప్రచారమాధ్యమాల సహకారంతో ప్రతీరోజూ తానున్నానని చెప్పుకునేయత్నంలో ఉంది. బీజేపీ అయితే ఏదో కార్యక్రమాలతో కలకలం సృష్టించాలని చూస్తోంది. కానీ ఆపార్టీకి బలం సరిపోకపోవడంతో మాటలు తప్ప చేతలు లేని పార్టీగా మిగిలిపోతోంది. చివరకు కమ్యూనిస్టుల సైతం తమకున్న శక్తి మేరకు వివిధ అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారు. కానీ జనసేన పార్టీ పరిస్థితి అన్నింటికీ భిన్నం. పూర్తిగా పవన్ కళ్యాణ్ మీద ఆధారపడడం పార్టీకి పెద్ద సమస్య అవుతోంది. కనీసం ప్రజల్లో పలుకుబడి ఉన్న మరో నాయకుడు ఆపార్టీలో లేకపోవడం లోటుగా మారింది. నాదెండ్ల మనోహర్ కి సొంతూరు తెనాలిలోనే పట్టుమని పదివేల ఓట్లులేని పరిస్థితి. దాంతో ఆయనకు సొంతూరు ఆవల ఏమాత్రం ఫాలోయింగ్ ఉంటుందో చెప్పవచ్చు. కానీ పవన్ ఇమేజ్ నీడలో కొంత కదులుతున్నా స్వతహాగా మాస్ లీడర్ కాకపోవడం జనసేనను దెబ్బతీస్తోంది
అధినేత దృష్టి సినిమాల మీద ఉంది. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. మిగిలిన సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. దాంతో రాజకీయాల మీద దృష్టి తగ్గింది. ఓవైపు వచ్చే ఎన్నికల్లో జనసేన తమతోనే ఉంటుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే లేదు జనసేన, టీడీపీ కలిసి సాగడం ఖాయమనే సంకేతాలు పచ్చ శిబిరం నుంచి వస్తున్నాయి. దాంతో కొన్ని పార్టీలు తమవైపు చూస్తున్నందుకు ఆనందించాలా లేక తమ పార్టీ ఉపగ్రహమే తప్ప స్వయంగా ఎదిగే అవకాశం లేనందుకు బాధపడాలా అన్నది కార్యకర్తలకు అంతుబట్టని అంశంగా మారింది.
గడిచిన క్యాలెండర్ ఏడాదిలో పవన్ కళ్యాణ్ 10 సందర్భాల్లో ఏపీలో పర్యటించారు. ఏదో అంశాన్ని ఆధారంగా ఒకటి, రెండు రోజులు ప్రజల్లోకి వెళ్లారు. కానీ ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్ వెళ్ళిపోవడం మినహా ఆయా సమస్యల మీద కొనసాగింపు కూడా చేయలేకపోయారు. సమస్య పరిష్కారమయ్యే వరకూ , ప్రభుత్వాన్ని కదిలించే వరకూ పోరాడితే నాయకుడికి గుర్తింపు వస్తుంది. లేదంటే పార్ట్ టైమ్ పొలిటీషియన్ ముద్ర బలపడిపోతుంది. ఇది తెలిసినా జనసేనాని ఎందుకో ఆసక్తికరంగా రాజకీయాలు నడిపే దృష్టిలో లేనట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు కాపు నేతలు జనసేన భవిష్యత్తు గురించి అంచనావేసి ఎవరి దారి వారు చూసుకోవాలనే లక్ష్యానికి వచ్చారు. పవన్ తో పనికాదని కాపులకు ప్రత్యామ్నాయం గురించి కూడా మరోవైపు చర్చలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ పార్టీ ప్రస్థానం రానురాను ప్రశ్నార్థకం అవుతోంది.