iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల వాయుగుండం విలయం సృష్టించింది. గడిచిన అర్థ శతాబ్దకాలంగా ఎన్నడూ లేని రీతిలో రాయలసీమను అతలాకుతలం చేసింది. నెల్లూరు జిల్లాలో విలయం సృష్టించింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం మిగిల్చింది. తిరుమలలో దాని ప్రభావం ఇంకా కనిపిస్తోంది. కొండ చెరియలు పదే పదే విరిగిపడుతూ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అదే సమయంలో ప్రకాశం జిల్లాలో కూడా మీడియం రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. దానికి తోడుగా తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో మరింత కలవరపెడుతోంది. ఎటువంటి ముప్పు తీసుకొస్తుందోననే ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం బంగాళాఖాతంలో అండమాన్ కి సమీపంలో అల్పపీడనంగా ఏర్పడిన తర్వాత వాయుగుండంగా మారినట్టు చెబుతున్నారు. క్రమంగా తీరం వైపునకు వస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరుకు 1400 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ శాఖ చెబుతోంది. శుక్రవారం రాత్రికి తుఫాన్ గా బలపడవచ్చని భావిస్తోంది.
తుఫాన్ గా బలపడిన తర్వాత దాని ప్రభావం ఏపీలోని ఉత్తరాంద్ర మీద కూడా ఉండొచ్చని చెబుతోంది. అయితే జవాద్ తుఫాన్ గా పిలవాలని నిర్ణయించిన ఈ తుఫాన్ తాకిడి ఎక్కువగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు ఉంటుందని భావిస్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దక్షిణాంధ్ర ప్రాంతానికి ఇది ఊరటగానే భావించవచ్చు. అయితే ఈశాన్య దిశగా తుఫాన్ పయనిస్తే ఉత్తరాంధ్ర కి కూడా ఉపశమనం దక్కుతుందని, ఆంధ్రప్రదేశ్ గట్టెక్కవచ్చని వాతావరణ శాఖ అంచనాగా ఉంది.
ఉత్తరాంధ్రపైనా పెను ప్రభావం
ఇప్పటికే భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీలో ఏకంగా 6వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. కేంద్ర ప్రభుత్వ బృందాలు కూడా రాష్ట్రంలో పర్యటించాయి. నష్టం అంచనా వేశాయి. కేంద్రానికి నివేదిక అందించాయి. కానీ ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. వెయ్యి కోట్లు తక్షణ సహాయం అందించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్ లో కోరారు. సీఎం కూడా ప్రధానికి లేఖ రాశారు. ఇక సీఎం కూడా నేటి నుంచి మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మూడు జిల్లాల్లో ఆయన బాధితులను పరామర్శిస్తారు. అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ సమయంలో మరో తుఫాన్ తాకిడి నుంచి గట్టెక్కితే చాలని అంతా ఆశిస్తున్నారు.
Also Read : Cyclone, North Andhra – ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పు