iDreamPost
iDreamPost
సైబర్ ప్రపంచం.. ప్రస్తుత జనజీవనాని ఎంతగా సౌకర్యాలను సమకూరుస్తుందో, కేటుగాళ్ళకు కూడా అంతే స్థాయిలో అవకాశాలను సృష్టిస్తోంది. రెండువైపులా పదునుండే కత్తిలాంటి ఈ వ్యవస్థ వాడుకున్నవాళ్ళకు వాడుకున్నంత ఇస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఇంటర్నెట్ సంబంధిత కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో అవగాహన లేని దేశాల్లో సైబర్ సంబంధి నేరాలు కోకొల్లలుగా పేరిగిపోతున్నాయి.
దీనిపై ఇంకా నేర్చుకునే స్థాయిలో ఎక్కువశాతం మంది ఉన్న మనదేశంలో కూడా సైబర్ ప్రపంచపు మోసాల్లో అనేక మంది తమ కష్టార్జితాన్ని కోల్పోయి పోలీస్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇందులో రికవరీ అయ్యే మొత్తాలు పెద్దగా ఉండవన్నది బహిరంగ రహస్యమే. కనీసం నేరం చేసిన వాడెవడో గుర్తించడానికే కష్టమైపోయే పరిస్థితి. అడపాదడపా పట్టుబడే నేరగాళ్ళ సంఖ్య, జరుగుతున్న నేరాలతో పోలిస్తే అతి తక్కువశాతమేనని పోలీసు వర్గాలే చెబుతుంటాయి. ఏటీయం మోసాలు, పీవోఎస్‌ల వద్ద మోసాలు, కార్డు క్లోనింగ్, సహాయం కోసం అర్ధించి మన అక్కౌంట్లో డబ్బులు కొట్టేయడం.. తదితర రకాలన్నీ సైబర్ మోసాలుగానే పరిగణిస్తారు.
సాధారణంగా సామాన్యజనం ఇటువంటి మోసాల భారిన పడుతుంటారు. అయితే ఇప్పుడు ఉభయతెలుగు రాష్ట్రాల్లోనూ పోలీస్‌ల వంతు వచ్చింది. వారి పేర్లతో ఈ విధమైన ఆన్‌లైన్ మోసాలకు నేరగాళ్ళు తెరతీసారు. ముఖ్యంగా ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పాల్పడుతున్న ఈ మోసం కారణంగా సొంత డిపార్ట్‌మెంట్‌వారు, డిపార్ట్‌మెంట్‌తో సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు డబ్బులు పోగొట్టుకోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది.
అసలు ప్రొఫైల్‌కి అచ్చుగుద్దినట్టుగానే నకిలీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేయడం, దాన్నుంచి ఛాటింగ్ చేస్తూ డబ్బులు రిక్వెస్ట్ చేయడం తద్వారా మోసానికి పాల్పడుతున్నారు. ఈ విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటి వరకు పదుల సంఖ్యలోనే మోసాలు జరిగనట్టుగా చెబుతున్నారు. ఇంకా యాభైవరకు నకిలీ ఐడీలను గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పోలీసు వర్గాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఐజీ స్థాయి నుంచి ఎస్‌ఐ స్థాయి వరకు ఈ నకిలీ ఐడీల్లో ఉన్నారని చెబుతున్నారు.
సాధారణంగా పెద్ద స్థాయిలోని వారెవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వారు ఇచ్చేంత వరకు అడిగేందుకు సాహసం చేయరు. సరిగ్గా ఇదే వీక్‌పాయింట్‌ను మోసగాళ్ళు ఆసరాగా చేసుకున్నట్లుగా కన్పిస్తోంది. దీంతో సంబంధిత ఉన్నతాధికారుల పేరుమీద ఫేక్ ఐడీలు సృష్టించి, వారి క్రింద ఉండే సిబ్బందికే గేలం వేస్తున్నారు. వీరి గేలానికి చిక్కి అధికారి అడిగినట్టు డబ్బులు పంపిస్తే అది కేటుగాళ్ల పరమైపోతోంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఫేక్ ఐడీలు ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు తమ ఒరిజినల్ ఐడీల్లో ‘డబ్బులు అడుగుతూ’ ఎటువంటి మెస్సేజ్‌లు వచ్చినా తక్షణమే తమ దృష్టికి తీసుకు రావాలని కోరుతూ మెస్సేజ్‌లు పెట్టుకోవాల్సి వస్తోంది.
మనిషి ఎవరో తెలియకుండా మోసం చేయడం అనాదికాలంగానే అమలవుతోంది. కానీ ఇప్పుడు సైబర్ ప్రపంచ కాలంలో మరింత ముందుకు పోతోంది. మనకు తెలియకుండానే మనపేరుతో ఎదుటి వ్యక్తిని సులభంగానే మోసం చేయగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు వ్యక్తిగతంగా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసు వర్గాలు సూచిస్తున్నాయి.