iDreamPost
iDreamPost
ప్రపంచమంతా ఇప్పుడు క్రిప్టో కరెన్సీ వైపు మొగ్గు చూపుతోంది. మనదేశంలో కూడా యూత్ చాలామంది పెట్టుబడులు పెడుతున్నారు. పెద్దమొత్తంలో అందుకు సిద్ధమవుతున్నారు. ప్రపంచంలోనే క్రిప్టోలో పెట్టుబడులు పెట్టిన వారిలో అత్యధికులు భారతీయులే ఉండడం విశేషం. ఇటీవల టీ20 వరల్డ్ కప్ ప్రత్యక్ష ప్రసారాల సందర్భగా ప్రతీ రెండు యాడ్స్ లో ఒకటి క్రిప్టో కరెన్సీ యాప్స్ దే కావడం అందుకు అద్దంపడుతోంది.
అయితే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడుతున్న చాలామంది జాగ్రత్తలు పాటించడం లేదు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాల కోసం ప్రయత్నిస్తున్నారు. అత్యాశతో అసలుకే ముప్పు వస్తుందనేది గుర్తించడం లేదు. అలాంటి వారిలోనే ఖమ్మం నగరానికి చెందిన గుండిమెడ రామలింగస్వామి ఒకరు. సొంతంగా ఓ ప్రైవేటు స్కూల్ నడుపుకుంటున్న ఆయన లాక్ డౌన్ లో క్రిప్టో కరెన్సీ వైపు మొగ్గు చూపారు. తను భారీగా పెట్టుబడులు పెట్టారు. తొలుత లాభాలు కూడా సంపాదించారు. తనతో పాటుగా తెలిసిన వారందరినీ అందులో పెట్టుబడులకు ప్రోత్సహించారు. కానీ తీరా చూస్తే సుమారు రూ. 70లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టిన తర్వాత అందులో నష్టాలు రావడంతో నిండా మునిగిపోయారు.
సన్నిహిత మిత్రులే ఆయన నష్టాల్లో ఉన్నప్పుడు తీవ్రంగా వేధించారు. కారు కూడా లాక్కున్నారు. దాంతో మనోవేధనతో చివరకు సూర్యాపేట లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఈ కేసు సంచలనమయ్యింది. మంచి లెక్కల మాష్టారిగా గుర్తింపు రామలింగస్వామి ఇలా క్రిప్టో కరెన్సీ లో లాభాల వేటకు దిగి చేతులు కాల్చుకుని, చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన ఖమ్మంలో విషాదం నింపింది. అదే సమయంలో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడుతున్న వారిని అప్రమత్తం చేస్తోంది. అజాగ్రత్తగా వ్యవహరిస్తే ఆర్థికంగా మునిగిపోతారనే విషయాన్ని చాటుతోంది.
క్రిప్టో కరెన్సీ విషయంలో ఏం చేయాలన్నది కేంద్రానికి కూడా అంతుబట్టడం లేదు . ఈనెల 29న అత్యున్నత సమావేశం కూడా జరగబోతోంది. కేంద్రం కూడా క్రిప్టోని పూర్తిగా నిషేధించే పరిస్థితి లేదని ప్రచారం సాగుతోంది. ఎలా నియంత్రిస్తుందో చూడాలి. కానీ క్రిప్టో కరెన్సీ పేరుతో కొన్ని నకిలీ యాప్ లు సృష్టించి, అధిక లాభాలు ఆశ చూపించి చాలామందిని ముంచేస్తున్నట్టు తెలుస్తోంది. రామలింగస్వామి అనే ఖమ్మం టీచర్ ఆత్మహత్యకు అలాంటి నకిలీ యాప్ లు కూడా కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. ఏమయినా క్రిప్టో కరెన్సీ విషయంలో పెట్టుబడులు పెట్టే ముందు పలుమార్లు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.