iDreamPost
iDreamPost
సిటీ ఆఫ్ డెస్టినీగా, ఏపీ ఆర్థిక రాజధానిగా.. అన్నింటికీ మించి పర్యాటకుల స్వర్గంగా విలసిల్లుతున్న విశాఖ నగరం త్వరలో అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అవతరించనుంది. ఇప్పటికే విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ నగరం నుంచి అంతర్జాతీయ నౌకావిహార (క్రూయిజ్) సర్వీసులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇక్కడి నుంచి విదేశాలకు క్రూయిజ్ షిప్పులు నడిపేందుకు వీలుగా విశాఖ పోర్టులో ప్రత్యేకంగా క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏడాదిలోపే విదేశీ విహార నౌకల రాకపోకలు ప్రారంభం అవుతాయి.
రూ.100 కోట్లతో ప్రత్యేక టెర్మినల్
అంతర్జాతీయ క్రూయిజ్ సర్వీసుల ప్రాజెక్టును విశాఖ పోర్ట్ ట్రస్ట్, కేంద్ర నౌకాయాన శాఖ, కేంద్ర రాష్ట్రాల పర్యాటక శాఖలు సంయుక్తంగా చేపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన అనుమతులన్నీ ఇప్పటికే లభించాయని విశాఖ పోర్ట్ చైర్మన్ రామ్మోహనరావు చెప్పారు. ఇందుకోసం రూ.100 కోట్లతో పోర్టులో ప్రత్యేక బెర్త్ నిర్మాణానికి టెండర్లు కూడా ఆహ్వానించారు. రూ.65 కోట్లతో బెర్త్, రూ.35 కోట్లతో టెర్మినల్ భవనం నిర్మిస్తారు. టెండర్లు ఖరారు చేసిన తర్వాత ఏడాదిలోపే నిర్మాణం పూర్తి చేయాలని నిబంధన పెట్టారు. దీని నిర్వహణ అనుమతులను ఏపీ ప్రభుత్వం జారీ చేస్తుందని రామ్మోహనరావు వెల్లడించారు. క్రూయిజ్ సర్వీసుల ప్రాజెక్ట్ విశాఖ పోర్ట్ చరిత్రలో ఒక మైలు రాయి అని వర్ణించిన ఆయన విశాఖకు అంతర్జాతీయంగా మరింత పేరుప్రతిష్టలు తెచ్చేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందన్నారు.
పర్యాటకులను రప్పించేందుకు ప్రణాళికలు
ఒకవైపు క్రూయిజ్ బెర్త్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతుంటే మరోవైపు విదేశీ క్రూయిజ్ షిప్పులను విశాఖకు రప్పించేందుకు పర్యాటక శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దేశంలో ప్రస్తుతం ముంబై, కొచ్చి, గోవా, మంగుళూరు, చెన్నైలలో అంతర్జాతీయ క్రూయిజ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వచ్చే విదేశీ విహార నౌకల నిర్వాహకులు, టూర్ ఆపరేటర్లు, షిప్పింగ్ ఏజెంట్లతో మాట్లాడి విశాఖకు క్రూయిజ్ షిప్పులను, విదేశీ పర్యాటకులను రప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విహార నౌకల్లో ఫైవ్ స్టార్ హోటళ్లలో లభించే సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంటాయి. రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్స్, ఇండోర్ గేమ్స్, థియేటర్లు, డాన్సు ఫ్లోర్లు తదితర ఉన్నత స్థాయి సౌకర్యాలు కల్పిస్తారు. ఒక్కో నౌకలో 1500 నుంచి 2 వేల మంది వరకు ప్రయాణిస్తూ వాటిలోనే పార్టీలు, ఫంక్షన్లు చేసుకోవచ్చు. క్రూయిజ్ సర్వీసులు విశాఖ పర్యటకానికే మకుటాయమానంగా భాసిల్లే అవకాశం ఉంది.