ఆ మధ్య గురు తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఎఫ్2 తో మునుపటి ఫామ్ లోకి వచ్చేసిన విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది ఏకంగా రెండు సినిమాలతో పలకరించబోతున్నారు. నారప్ప షూటింగ్ పూర్తి చేసుకుని మే విడుదలకు రెడీ అవుతోంది. అసురన్ రీమేక్ గా రూపొందిన ఈ మూవీ ఫస్ట్ లుక్ వచ్చాక అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. ప్రియమణి వెంకీ సరసన నటించగా మణిశర్మ సంగీతం సమకూర్చారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. మరోవైపు యమా స్పీడ్ తో ఎఫ్3 షూట్ జరిగిపోతోంది. అనిల్ రావిపూడి ఊహించిన దానికన్నా వేగంగా కానిస్తున్నాడు. ఆగస్ట్ 27 రిలీజ్ డేట్ చెప్పేశారు కాబట్టి దానికనుగుణంగా పనులు జరుగుతున్నాయి.
వీటి తర్వాత వెంకటేష్ ట్రెండీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో జట్టు కట్టడం దాదాపు ఖాయమే. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయ్యిందని, ఫైనల్ వెర్షన్ చాలా బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. దీని కోసం క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ ని చాలా క్రియేటివ్ గా సెట్ చేసుకున్నట్టు తెలిసింది. హీరోయిన్లుగా భావనా మీనన్, రైమా సేన్ లను తీసుకున్నారట. సంగీతం వివేక్ సాగర్ ఇచ్చే అవకాశం ఉందని వినికిడి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇంకొకరితో టైఅప్ లేకుండా సోలో నిర్మాణం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎఫ్3లో తన పని అవ్వగానే వెంకీ దీని మీద పూర్తి ఫోకస్ పెట్టబోతున్నారట.
పెళ్లి చూపులు లాంటి కూల్ బ్లాక్ బస్టర్ అందుకున్నాక తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది రూపంలో ఒక అర్బన్ హిట్ కొట్టడం తప్ప చాలా గ్యాప్ తీసుకున్నదే ఎక్కువ. మధ్యలో యాక్టర్ గా హీరోగా చేసినా కూడా అవేవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అందుకే మళ్ళీ డైరెక్టర్ క్యాప్ తో సిద్ధమవుతున్నాడు. చిరంజీవి తరహాలోనే వెంకటేష్ కూడా నాన్ స్టాప్ సినిమాలు చేసేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. ఏడాదికి రెండు సినిమాలు వచ్చేలా అభిమానులకు కానుకలు ఇవ్వబోతున్నారు. ఇప్పుడీ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అన్నీ మరికొద్ది రోజుల్లో రాబోతున్నాయి