iDreamPost
iDreamPost
ఓటిటి తెచ్చిన అనూహ్యమైన మార్పు పరిశ్రమలో ఉన్న హద్దులను చెరిపేస్తోంది. వారు వీరు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరినీ తన వైపు వచ్చేలా చేసుకుంటోంది. ఈ విషయంలో బాలీవుడ్ తర్వాత కోలీవుడ్ ముందంజలో ఉంది. అందరూ కలిసికట్టుగా డిజిటల్ అవకాశాలనూ అందిపుచ్చుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇది సరికొత్త విప్లవానికి దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ 9 చిన్న సినిమాలతో కూడిన ఓ సిరీస్ ని నవరస పేరుతో ప్రకటించింది. ఇప్పటికే ఇందులో అధిక శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. అలా అని ఇదేదో అప్ కమింగ్ ఆర్టిస్టులతో డైరెక్టర్లతో తీసింది కాదు. లిస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది.
ముందుగా యాక్టర్ల సంగతి చూద్దాం. అరవింద్ స్వామి, సూర్య, సిద్దార్థ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, శరవణన్, అలగం పెరుమాళ్, ప్రసన్న, విక్రాంత్, సింహా, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్, రోబో శంకర్, రమేష్ తిలక్, సనంత్, విధు, శ్రీరామ్ లు మేల్ క్యాటగిరీలో ఉన్నారు. రేవతి, నిత్యా మీనన్, పార్వతి తిరువోతు, ఐశ్వర్య రాజేష్, పూర్ణ,రిత్విక తదితరులు మహిళల బ్యాచ్. ఈ ,మొత్తం సిరీస్ ని దర్శక దిగ్గజం మణిరత్నం, జయేంద్ర పంచపకేషన్ లు స్వీయ నిర్మాణంలో పర్యవేక్షిస్తారు. నలుగురు రచయితలు పనిచేశారు. అందరూ ఆయా రంగాలలో నిష్ణాతులు కావడం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం
ఇక డైరెక్టర్ల సంగతి చూస్తే కెవి ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బిజోయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజ్, పొన్రామ్, హలితా షమీమ్, కార్తీక్ నరేన్,రతింద్రన్ ఆర్ ప్రసాద్, అరవింద్ స్వామి ఈ తొమ్మిది భాగాలకు ఒక్కొక్కరు కెప్టెన్ గా వ్యవహరిస్తారు. సంగీతం విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్, ఇమ్మాన్, గిబ్రాన్, అరుళ్ దేవ్, కార్తీక్, రోన్ ఏతాన్ యోహాన్, గోవింద్ వసంత, జస్టిన్ ప్రభాకరన్ స్కోర్ ఇచ్చే బాధ్యతలు తలెకెత్తుకున్నారు. సినిమాటోగ్రాఫర్స్ లో సైతం సంతోష్ శివన్, మనోజ్ పరమహంస, బాలసుబ్రమణియన్ లాంటి అగ్రజులు పోటీ పడుతున్నారు. ఏ కోణంలో చూసినా తమిళ ఇండస్ట్రీలోని అత్యున్నత టాలెంట్ ఈ నవరస కోసం కోసం జట్టు కట్టడం అరుదైన సంగమమని చెప్పొచ్చు. త్వరలో అన్ని భాషల్లోనూ దీన్ని విడుదల చేయబోతున్నారు.