iDreamPost
iDreamPost
అమరావతి పేరుతో చంద్రబాబు అండ్ కో చేస్తున్న రాజకీయ యత్నాలకు తాము సహకరించలేమంటూ సీపీఎం చెప్పేసింది. తిరుపతిలో నిర్వహిస్తున్న సభకు హాజరుకాలేమంటూ తేల్చేసింది. బీజేపీతో రాజకీయ స్నేహానికి ఆరాటపడుతున్న చంద్రబాబు తిరుపతి సభను అవకాశంగా మలచుకోవాలనే యత్నంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తమను సభకు ఆహ్వానించి, బీజేపీని కూడా పిలిచినందున తాము రాలేకపోతున్నట్టు సీపీఎం ప్రకటించింది. ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు పేరుతో లేఖ విడుదల చేసింది. అమరావతి జేఏసీ నాయకుడు శివారెడ్డికి రాసిన లేఖను బహిరంగంగా విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీని ఎదుర్కొనేందుకు బీజేపీ తో మళ్లీ స్నేహం చేయాలని చాలాకాలంగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మొన్నటి మహానాడులో బేషరుతుగా కేంద్ర ప్రభుత్వానికి మద్ధతు కూడా ప్రకటించారు.అయినప్పటికీ మోదీ- షాలు ఆయన మొఖం చూసేందుకు కూడా అంగీకరించడం లేదు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో రాజకీయం చేయాలని బాబు చేసిన యత్నాలకు బీజేపీ పెద్దలు బ్రేకులు వేశారు.ఎంతో హడావిడి చేసినా ఆఖరికి అమిత్ షా దర్శనం కూడా దక్కకపోవడంతో చంద్రబాబు పరువు పోగొట్టుకోవాల్సి వచ్చింది.
Also Read : ఈనాడు రాజకీయ జర్నలిజం కొనసాగుతోంది
అమరావతి రైతుల ఉద్యమం అంటూ చేస్తున్న రాజకీయ ప్రహసనం ఆసరాగా చేసుకుని ఏపీలో బీజేపీని తన దారిలోకి తెచ్చుకోవాలనే యత్నంలో ఆయన ఉన్నారు. అయితే చాలాకాలంగా బీజేపీ నేతలు మాత్రం బాబుతో కలిసి వేదిక పంచుకోవడానికి ససేమీరా అన్నారు. ఇప్పుడు మాత్రం తిరుపతి సభలో బీజేపీ నేతలు కూడా పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది బాబు రాజకీయాలకు అనుగుణంగా జరుగుతున్నట్టుగా అందరికీ ఇట్టే అర్థమవుతోంది. అదే సీపీఎంకి రుచించలేదు. తమను ఆహ్వానించి ఆ తర్వాత మళ్లీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీని ఎలా ఆహ్వానిస్తారని ఆపార్టీ ప్రశ్నించింది.బీజేపీతో కలిసి తాము వేదిక పంచుకునే అవకాశం లేదని ప్రకటించింది.
అదే సమయంలో సీపీఎం కీలక ప్రకటన అమరావతి రైతులకు ఆశనిపాతంగా మారుతుందా అనే సందేహం వస్తోంది. అమరావతి కేంద్రంగా శాసన, పాలనా రాజధాని ఉండాలని మాత్రమే సీపీఎం డిమాండ్ చేసింది. న్యాయరాజధానిగా కర్నూలుకి ఆపార్టీ సానుకూలత వ్యక్తం చేసినట్టు ఈ తాజా ప్రకటన చెబుతోంది. ఇటీవల రాయలసీమ ఆందోళనకారుల ధర్నా సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుని విజయవాడలో కొందరు నిలదీశారు. ఆ సమయంలో కూడా కర్నూలు న్యాయరాజధానికి తాము వ్యతిరేకం కాదని ఆయన చెప్పాల్సి వచ్చింది. తాజా ప్రకటనలో అధికారికంగానే కర్నూలులో న్యాయరాజధానికి సీపీఎం సుముఖత వ్యక్తం చేసిన తరుణంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మరింత బలం చేకూరినట్టయ్యింది.
Also Read : సీఎం వ్యాఖ్యల వక్రీకరణ.. కటకటాల్లోకి టీడీపీ చీఫ్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్
ఇప్పటికే వైఎస్సార్సీపీ తరుపున సీఎం అధికారికంగానే దానికోసం చట్టాలు చేశారు. శ్రీభాగ్ ఒడంబడికను ప్రస్తావించారు. బీజేపీ కూడా రాయలసీమ డిక్లరేషన్ చేసింది. జనసేన,టీడీపీ నేతలు కూడా సన్నాయి నొక్కులతో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకి తాము వ్యతిరేకం కాదనే రీతిలో మాట్లాడారు.ఇప్పుడు లెఫ్ట్ నేతలు కూడా మద్ధతు పలకడంతో కర్నూలు విషయంలో క్లారిటీ వస్తున్నట్టు కనిపిస్తోంది.