సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ఏడాదికే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు జ్ఞానోదయం అయినట్లు కనిపిస్తోంది. గడచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామని నారాయణ నిర్వేదం వ్యక్తం చేశారు. చేసిన తప్పుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. గడిచిన ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రధాని మోదీ కాళ్లు మొక్కుతున్నారని మండిపడ్డారు.
అంతేకాకుండా నారాయణ.. పవన్‌ను వ్యక్తిగతంగానూ విమర్శించారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తికి అసలు వ్యక్తిత్వమే లేదంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు ఉన్నాయంటూ విశాఖలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పవన్‌పై విరుచుకుపడ్డారు.
2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి మద్ధతు తెలిపిన జనసేన.. గడచిన ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు దూరంగా ఉంది. సీపీఐ, సీపీఎం, బీఎస్పీ పార్టీలతో జనసేనాని పొత్తు పెట్టుకున్నారు. మూడు పార్టీలతో కలసి సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీ చేశారు. ఎన్నికలకు ముందే జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు కలసి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించాయి. అయితే ఈ సారైనా ఏపీ అసెంబ్లీలో అడుగు పెడదామని భావించిన కామ్రేడ్లకు నిరాశే ఎదురైంది. సీపీఎం, సీపీఐ పార్టీలు ఒక్క సీటు కూడా నెగ్గలేదు. బీఎస్పీ పరిస్థితి కూడా కామ్రెడ్ల మాదిరిగానే ఉంది.
అసలు జనసేన పార్టీనే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోగా.. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ స్వల్ప ఓట్ల మోజారిటీతో గెలిచారు. అయితే ఎన్నికల ముగిసిన కొద్ది నెలలకే పవన్ కళ్యాణ్ కామ్రేడ్లను వదిలి బీజేపీతో స్నేహం చేయసాగారు. ఆ పార్టీతో పొత్తు రాజకీయాలు మొదలు పెట్టారు. ఇదే సీపీఐ నారాయణకు ఆగ్రహం తెప్పించినట్లుంది. అందుకే పవన్ వ్యక్తిగత జీవితంపై కూడా తీవ్ర విమర్శలు చేసినట్లుగా అర్థమవుతోంది.