హైదరాబాద్ – రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి రంగ ప్రవేశంతో ఎమ్మెల్సీ ఎన్నికల చిత్రం మారిపోయింది. ఆ స్థానంలో అస్సలు టీఆర్ఎస్ పోటీ చేయడం లేదంటూ విపక్షాలు తొలి నుంచీ ప్రచారం చేస్తూ వచ్చాయి. కేసీఆర్ అనూహ్యంగా రంగంలోకి పీవీ కుమార్తెను దించడంతో అందరూ షాక్ కు గురయ్యారు.
కరుడుగట్టిన కాంగ్రెస్ వాది పీవీ కుటుంబానికి చెందిన వ్యక్తి టీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం ఓ ఎత్తయితే, కేసీఆర్ కు సంబంధించి పీవీ కుమార్తె ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తుగా మారింది. దీనిపై ఎవరి సంగతి ఎలాగున్నా సీపీఐ నారాయణకు మాత్రం తెగ ఇబ్బందిగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమె కేసీఆర్ ను పొగడడం ఆయనకు ఇబ్బంది కలిగిందో, లేక మరే కారణం తెలియదో కానీ వాణిదేవి మాటలకు పీవీ బతికుంటే ఆత్మహత్య చేసుకునేవారని నారాయణ అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
విషయం ఏంటంటే.. తన తండ్రి పీవీ నరసింహారావుకు, తెలంగాణ సీఎం కేసీఆర్ కు అనేక అంశాల్లో సారూప్యత ఉందని వాణిదేవి తెలిపారు. తన తండ్రి పీవీ రైతు అని, సీఎం కేసీఆర్ కు కూడా వ్యవసాయం అంటే ఎంతో మక్కువ అని వివరించారు. పీవీ సంస్కరణాభిలాషి అని, కేసీఆర్ కూడా సంస్కరణలు కోరుకునే వ్యక్తి అని పేర్కొన్నారు. తన తండ్రికి 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్నా, మాతృభాష, యాస ఎప్పుడూ విడిచిపెట్టలేదని వాణీదేవి అన్నారు. ఇంటికి వస్తే ఆయన తెలంగాణ యాసలోనే మాట్లాడేవారని తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా భాష కోసం, యాస కోసం ఎంతో తాపత్రయం చూపుతారని, భాష, యాస మనుగడను ఆయన పరిరక్షించారని కొనియాడారు. తెలంగాణ భాషనే అసలైన తెలుగు భాషగా చెప్పే స్థాయికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. పీవీ, కేసీఆర్ ఇద్దరూ సాహిత్యం పట్ల అభిలాష ఉన్నవారేనని వాణీదేవి వివరించారు. నాడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించిన వ్యక్తి పీవీ అయితే, తెలంగాణను సాధించి, రక్షించిన మహానుభావుడు కేసీఆర్ అని ఆమె కీర్తించారు.
దీనిపై నారాయణ మాట్లాడుతూ వాణీదేవీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పీవీ బతికుంటే ఆమె మాటలకు ఆత్మహత్య చేసుకునేవారన్నారు. పీవీకి, కేసీఆర్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. కేసీఆర్‌ను వాణీదేవి తన తండ్రి పీవీతో పోల్చటం హ్యాస్యాస్పదమన్నారు. పీవీ చనిపోయి బతికిపోయాడన్నారు. ఆయన కుమార్తె మాటలకు ఏ లోకంలో ఉన్నా పీవీ బాధపడటం ఖాయమని, పీవీ కుమార్తె రూపంలో అద్దె అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ తెచ్చుకుందని ఎద్దేవా చేశారు. పీవీ శత జయంతి ఉత్సవాలు జరపకుండా కేసీఆర్ మోసం చేశారన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయరు కాబట్టే పీవీ పేరుతో ఓట్లు అడుగుతున్నారన్నారు. పీవీ భుజంపై తుపాకీ పెట్టిన కేసీఆర్.. కాంగ్రెస్‌ను కాల్చుతున్నాడన్నారు.
వాస్తవానికి తుది శ్వాస వరకూ కాంగ్రెసే ఊపిరిగా బతికిన పీవీ కుటుంబానికి మొదట నుంచీ ఆ పార్టీ పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. శత జయంతి ఉత్సవాల నిర్వహణపై కాంగ్రెస్ దృష్టి పెట్టలేదు. దీనిపై పీవీ కుటుంబ సభ్యులు పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఏ పార్టీవారైనా తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో పీవీ శతజయంతి ఉత్సవాలపై కేసీఆర్ చొరవ చూపారు. పీవీ విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో పీవీ కుటుంబం కేసీఆర్ పట్ల ఆకర్షితులైంది.
ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నుంచి పోటీలో దిగేందుకు పీవీ కుమార్తె వాణీదేవి ఆసక్తి చూపారు. ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ, పీవీకి, కేసీఆర్ కు సారూప్యంగా ఉన్న కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఎదుటి వ్యక్తులకు, తమకు సారూప్యంగా ఉండే కొన్ని లక్షణాలను గుర్తించినప్పుడు వాటిని పోల్చడం సాధారణమే. కోడి గుడ్డు మీద ఈకలు పీకే నారాయణకు దాంట్లో ఏం తప్పు అనిపించిందో ఆయనకే తెలియాలని పలువురు విమర్శిస్తున్నారు.
ప్రధాని పీఠం అధిరోహించిన తెలుగు వ్యక్తి, సొంత పార్టీ వ్యక్తి పీవీ శత జయంతి ఉత్సవాలపై కాంగ్రెస్ నిర్లక్ష్య్ం చూపినప్పుడు నారాయణ ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నిస్తున్నారు. పీవీ సంస్కరణలను కమ్యూనిస్టులు తొలి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. నారాయణ కూడా ఆ జాబితాలో ఉన్న వ్యక్తే. కానీ ఇప్పుడు హఠాత్తుగా పీవీపై ప్రేమ కురిపించడం హాస్యాస్పదంగా ఉందని విశ్లేషిస్తున్నారు.