iDreamPost
android-app
ios-app

ఏపీలో సీపెట్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

ఏపీలో సీపెట్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సురంపల్లిలో సంయుక్తంగా నిర్మించిన ‘సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, సెంటర్‌ స్కిల్లింగ్‌ అండ్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ (సీపెట్‌–సీఎస్‌టీఎస్‌) నూతన భవనాన్ని గురువారం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ రాష్ట్ర, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భాంగా సదానంద గౌడ మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ పరిశ్రమ, పరిశోధన రంగాల్లో అత్యధికంగా ఉన్న ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని  పేర్కొన్నారు. యువశక్తిని సద్వినియోగం చేసుకుని దేశాన్ని ప్రపంచంలో అగ్రరాజ్యంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. 9.30 శాతం వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతున్న దేశ ప్లాస్టిక్‌ పరిశ్రమ విలువ 2025 నాటికి 340 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందన్నారు. 

నెల్లూరు జిల్లాలో మరొకటి… 

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వినతి మేరకునెల్లూరు జిల్లా నాయుడుపేటలో మరో ‘సీపెట్‌’ను నెలకొల్పుతామని కేంద్ర మంత్రి సదానందగౌడ ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్‌ అందించిన సహకారం అభినందనీయమని, ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తాగునీరు, పట్టణాభివృద్ధి, సుందరీకరణ తదితర రంగాల్లో అభివృద్ధికి తమ శాఖ పూర్తిగా సహకరిస్తుందన్నారు.

యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి.. 

ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో 25 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను నెలకొల్పుతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందన్నారు. దేశంలో మన రాష్ట్రం మాత్రమే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిందని చెప్పారు.తగిన శిక్షణ పొందిన యువతను పారిశ్రామికరంగానికి అందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.