iDreamPost
iDreamPost
దేశంలో 18 ఏళ్ళు దాటిన వారందరికి ఒకటో తేదీ నుంచి కోవిడ్ టీకా వేస్తామన్న కేంద్రం ప్రకటన కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై కొత్త చర్చకు దారి తీస్తోంది. ఈ వయసు వారికి టీకా వేసే భారాన్ని రాష్ట్రాలపైకి నెట్టివేయడమే దీనికి కారణం. కేంద్రం తీరుపై ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ మంత్రి కేటీఆర్ వంటివారు దుమ్మెత్తి పోస్తున్నారు. కేంద్రం ప్రకటించిన కొత్త టీకా విధానం కేంద్ర రాష్ట్ర సంబంధాలకు విఘాతం కలిగించేలా, భారత సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్న విమర్శలు జోరందుకుంటున్నాయి.
కేంద్రానికి ఓ రేటు.. రాష్ట్రాలకో రేటా!
కోవిడ్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతం చేసే చర్యల్లో భాగంగా కొత్త టీకా పాలసీని కేంద్రం నాలుగు రోజుల క్రితం ప్రకటించింది. 18 ఏళ్ళు దాటినా వారికి కూడా మే ఒకటో తేదీ నుంచి టీకా వేయడానికి గేట్లు తెరుస్తున్నట్లు పేర్కొంది. అప్పట్లో దీన్ని అందరూ మెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగం, ఆ మరుసటి రోజే కోవిషీల్డ్ టీకా ధరల ఖరారుతో అసలు విషయం బయటపడింది. 18 ఏళ్ళు దాటినవారికి టీకా వేసే బాధ్యత నుంచి కేంద్రం పూర్తిగా తప్పుకొని.. ఆ భారాన్ని రాష్ట్రాలు, ప్రజలపైకి నెట్టేసింది. ఇప్పుడిస్తున్నట్లు 45 ఏళ్ళు పైబడిన వారికే ఉచిత టీకా కార్యక్రమాన్ని మాత్రమే కేంద్రం
కొనసాగిస్తుంది.
అందుకోసం దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు టీకాల ఉత్పత్తిలో 50 శాతం..అంటే సగం తనే తీసుకుంటుంది. మిగతా 50 శాతం ఉత్పత్తులను తయారీ సంస్థలు రాష్ట్రాలకు, ప్రైవేట్ ఆస్పత్రులకు విక్రయించుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంటే 18 ఏళ్ళు దాటిన వారికి టీకాలు వేయాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులు పోటీ పడి, సొంత నిధులు వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టీకా ధర విషయంలోనూ రాష్ట్రాల పట్ల వివక్ష ప్రదర్శించింది. కోవిషీల్డ్ టీకాను కేంద్రానికి డోసు రూ.150 రేటుకు అందజేస్తారు. అదే రాష్ట్రాలు కొనుగోలు చేయాలంటే ఒక్కో డోసుకు రూ.400, ప్రైవేట్ ఆస్పత్రులైతే రూ.600 వెచ్చించాల్సి వస్తుంది. ఆంటే కేంద్రం కంటే రాష్ట్రాలు దాదాపు 266 శాతం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక రూ.600 పెట్టి కొనుగోలు చేసే ప్రైవేట్ ఆస్పత్రులు .. మరింత రేటు పెంచి పౌరులకు అమ్ముకోవడం తథ్యం. దీనివల్ల అంతిమంగా ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది.
రూ.2వేల కోట్ల భారం
వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. వన్ కార్డ్.. అని అందమైన నినాదాలు ఇస్తున్న కేంద్రం కోవిడ్ టీకా విషయంలో ఆ నినాదాన్ని ఎందుకు అనుసరించడంలేదని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. 50 శాతం టీకా ఉత్పత్తి గంప గుత్తగా తీసుకుంటున్న కేంద్రం.. రాష్ట్రాలకు మాత్రం మార్కెట్లో పోటీ పడి కొనుగోలు చేసుకోమనడం దారుణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే తనకు రేటు, రాష్ట్రాలకు మరో రేటు ఖరారు చేసి దేశ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కల్గించింది. రాజ్యాంగంలోని 14, 21 ఆర్టికల్స్ ను ఉల్లంఘించిందన్న
ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర విధానం రాష్ట్రాలపై ఆర్థికంగా పెనుభారం మోపుతుంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాలు, పేద రాష్ట్రాలు నష్టపోతాయంటున్నారు. కేంద్ర నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు సుమారు రూ. రెండు వేల కోట్ల అదనపు భారం మోయాల్సి వస్తుంది. ఈ విధానం వల్ల కేసుల తీవ్రత బట్టి కాకుండా ఆర్థిక పరిస్థితి టీకా కార్యక్రమానికి కొలమానంగా మారిపోతుందని, ఇది సార్వత్రిక టీకా కార్యక్రమ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.