iDreamPost
android-app
ios-app

చదువులకు దీర్ఘకాలిక విరామమే, ఆగస్టు వైపు అంచనాలు

  • Published May 03, 2020 | 3:28 AM Updated Updated May 03, 2020 | 3:28 AM
చదువులకు దీర్ఘకాలిక విరామమే, ఆగస్టు వైపు అంచనాలు

కరోనా తాకిడితో చిన్నారుల ప్రణాళికలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి వేసుకున్న అంచనాలు తారుమారయ్యాయి. ఇప్పటికే రెండు నెలలుగా చదువులు ముందుకు సాగడం లేదు. మరో రెండు నెలల పాటు దాదాపుగా ఇదే పరిస్థితి అనివార్యం అనే అంచనాలు పెరుగుతున్నాయి. దాంతో ప్రాధమిక విద్యారంగం ఎలా ఉన్నప్పటికీ ఉన్నత విద్యకు సంబంధించి పలువురు విద్యార్థులు తీవ్రంగా మధన పడుతున్నారు. పోటీపరీక్షలకు పూర్తిగా సన్నద్ధం అవుతున్న దశలో వచ్చిపడిన లాక్ డౌన్ వారి అంచనాలతోను తలకిందులు చేయడంతో తల్లడిల్లుతున్నారు.

సహజంగా వేసవి కాలంలోనే సివిల్స్, నీట్ తో పాటుగా అన్ని పోటీపరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు దాదాపుగా అన్ని పరీక్షల షెడ్యూల్స్ తారుమారయ్యాయి. నేటికీ స్పష్టత లేదు. ఎప్పుడు జరుపుతారోననే బెంగ విద్యార్థులను వెంటాడుతోంది. పదో తరగతి పరీక్షల నుంచి దాదాపుగా ఆపైన అన్ని పరీక్షలు అలానే నిలిచిపోయాయి. ఇక పరీక్షలు పూర్తయిన సీబీఎస్ఈ టెన్త్ క్లాస్, ఇంటర్ వంటి పేపర్ల పరిస్థితి కూడా దాదాపు అంతే. ఎక్కడి పేపర్లు అక్కడే ఉన్నాయి. దాంతో వాటిని వాల్యూషన్ పరిస్థితి ఏమిటన్నది కూడా అంతుబట్టడం లేదు. ఇలా అన్ని తరగతుల విద్యార్థులకు ఈ పరిణామాలు తలనొప్పిగా మారాయి.

ప్రస్తుతం ప్రభుత్వం, విద్యావేత్తల అంచనా ప్రకారం రాబోయే విద్యాసంవత్సరలో కీలక మార్పులు జరగబోతున్నాయి. విద్యార్థులు భౌతికదూరం, మాస్కులు సహా అనేక జాగ్రత్తలు పాటిస్తూ క్లాసులకు హాజరుకావడం ఒకటైతే మొత్తం విద్యా సంవత్సరంలోనే మార్పులు జరగడం అనివార్యం అవుతోంది. దాంతో మే నెలాఖరు వరకూ లాక్ డౌన్ కొనసాగినా, ఆ తర్వాత జూన్ రెండోవారం నుంచి వివిధ పరీక్షలకు రంగం సిద్ధం చేసే అవకాశం ఉంది. జూలై చివరి నాటికి వాటి ఫలితాలు ప్రకటించి ఆగష్ట్ నుంచే కొత్త విద్యాసంవత్సరం ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యూజీసీ దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. ఆగష్ట్ తర్వాత 2020-21 విద్యాసంవత్సర ప్రారంభానికి సిద్ధం కావాలని ఆదేశాలు ఇచ్చింది.

వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి అనుగుణంగానే తమ విద్యాసంవత్సరాన్ని సవరించే ప్రయత్నంలో ఉన్నారు. మార్చి మూడోవారంలో నిలిచిపోయిన తరగుతులు మళ్లీ ఆగష్ట్ లో మొదలయితే నాలుగు నెలలకు పైగా చదువులు నిలిచిపోయినట్టవుతుంది. ఈలోగా విద్యార్థుల కోసం ప్రైవేటు సంస్థలు ఆన్ లైన్ క్లాసులు, ఇతర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ రెగ్యులర్ తరగతుల నిర్వహణకు మాత్రం అనుమతి దక్కే అవకాశం లేకపోవడంతో సుదీర్ఘకాలం పాటు పిల్లల చదువులు సాగకపోతే ఎలా అన్నది వారికి కూడా అంతుబట్టడం లేదు. దానికి తగ్గట్టుగా వివిధ దేశాల్లో పాఠశాలల పునః ప్రారంభ సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు వాటిని పరిశీంచి నిర్ణయం తీసుకోబోతున్నాయి. ఇవన్నీ జూన్ తర్వాతే మొదలయ్యే అవకాశం ఉండడంతో జూలై నాటికి కొత్త ప్రణాళికలు సిద్ధం చేయడం పూర్తయితే ఆగష్ట్ నుంచి 2021 జూన్ వరకూ కొత్త అకాడమిక్ ఇయర్ ఖాయం అంటున్నారు.

విద్యావిధానం, సిలబస్, విద్యార్థుల సన్నద్ధత సహా అనేక అంశాల్లో మార్పులు తప్పేలా లేకపోవడంతో అందరినీ దానికి అనుగుణంగా సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు తగు జాగ్రత్తలు పాటించేలా తర్ఫీదు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి పలు మార్పలకు తగిన సమయం తీసుకుని విద్యాసంవత్సరం ప్రారంభించే అవకాశం ఉండడంతో రాబోయే రోజుల్లో విద్యార్థులు దానికి అనుగుణంగా తయారుకావాల్సి ఉంటుది.