iDreamPost
iDreamPost
మొన్న జనవరిలో సంక్రాంతి సినిమాలన్నీ పక్క సీట్లని ఖాళీగా పెట్టుకుని ప్రేక్షకులు చూసిన సంగతి ఎప్పటికీ మర్చిపోలేరు. కుటుంబ సభ్యులతో వచ్చినా సరే గ్యాప్ తప్పక పాటించాల్సి వచ్చింది. కొంత కాలం అలా నడిపించాక ప్రభుత్వాలు ఇచ్చిన వెసులుబాటుతో మళ్ళీ వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు మొన్నటిదాకా కళకళలాడాయి. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అమలు పరిచేందుకు అధికారులు ఇప్పటికే రెడీ అయ్యారు. తెలంగాణలోనూ ఇవాళో రేపో గైడ్ లైన్స్ విడుదల చేయబోతున్నారు. సగం సీట్లతో పాటు మరికొన్ని ఆంక్షలను తీసుకొచ్చే అవకాశం ఉంది.
సరే ఇంతకుముందు క్రాక్ లాంటి సినిమాలు ఆడాయి, డబ్బులు తెచ్చాయి, బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాయి. సో ఇప్పుడు కూడా అలాంటి సీనే రిపీట్ అవుతుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ తాలూకు భయం జనంలో బాగా పెరిగిపోతోంది. అవసరం కాని వాటి గురించి రిస్క్ చేసేందుకు రెడీగా లేరు. వకీల్ సాబ్ ఉన్నట్టుండి విపరీతంగా స్లో అవ్వడానికి కారణం ఇదే. ఈ వారం రాబోతున్న తేజ సజ్జ ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ, 30కి విడుదల కానున్న అనసూయ థాంక్ యు బ్రదర్ ఇవేవి ఓపెనింగ్స్ వచ్చే సినిమాలు కాదు. టాక్ బాగుంటే ఆ ఉన్న యాభై శాతం సీట్లు ఫుల్ అయితే అదే పది వేలు అనుకోవాలి.
ఏదైనా స్టార్ హీరో నటించిన పెద్ద సినిమా వస్తేనే జనం పల్స్ అర్థమవుతుంది. కానీ నాగ చైతన్య నానిలతో మొదలుపెట్టి చిరంజీవి దాకా ఎవరూ రిస్క్ తీసుకునేందుకు రెడీగా లేరు. ఎంత లేట్ అయినా పర్లేదు కానీ మొత్తం నార్మల్ అయ్యాకే రిలీజ్ చేయాలని ఆయా ప్రొడ్యూసర్లు గట్టిగా డిసైడ్ అయ్యారు. సో ఈ 50 శాతం అనేది పెద్దగా ప్రభావం చూపించేది ఏమి ఉండకపోవచ్చు. అందులోనూ హిందీ ఇంగ్లీష్ నుంచి కూడా ఏ రిలీజులు లేవు. సో థియేటర్లు బోసిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. కాకపోతే ఇది మేకంతా సెట్ అవుతుందా లేక ఇంకా కొనసాగుతుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కాలమే.