Idream media
Idream media
కరోనా రెండో దశ ఉధృతికి కేంద్ర ఎన్నికల సంఘమే కారణం – మద్రాస్ హైకోర్టు
కరోనాతో ఎమ్మెల్యే అభ్యర్థి మృతిపై సీఈసీపై హత్య కేసు
విపత్కర పరిస్థితుల్లో ప్రజలు, ఎన్నికల సిబ్బంది, పోలీసు సిబ్బంది ప్రాణాలను ఫణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించకపోతే మిన్ను విరిగి పడుతుందా? – తెలంగాణ హైకోర్టు
దేశంలో కొవిడ్ రెండో దశ సృష్టిస్తున్న విలయతాండవం రోజూ చూస్తున్నదే. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అందుకు కారణాలు ఎన్ని ఉన్నా దేశంలో నిర్వహించిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు కరోనా వైరస్ కు దోహదం చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదని మద్రాస్ హైకోర్టు వెల్లడించింది. ఇప్పుడు తాజాగా తెలంగాణలో జరుగుతున్న మినీ మున్సిపోల్స్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యావత్ ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న తరుణంలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్లతోపాటు మరో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.
‘‘కొన్ని మున్సిపాలిటీల పాలక మండళ్ల గడువు ఏప్రిల్ 15తో ముగిసింది. చట్ట ప్రకారం వాటికి మరో నాలుగు నెలల్లో ఎన్నికల జరపవచ్చు. అంటే, ఆగస్టు వరకు అవకాశం ఉంది. పరిపాలనకు ప్రత్యేక అధికారులను నియమించవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు లేఖ రాశారు?’’ అని ఎన్నికల సంఘాన్ని నిలదీసింది. కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుంటే ఎన్నికలకు వెళ్లేందుకు మొగ్గు చూపడమేంటి?’’ అని నిలదీసింది. తాము మార్చి నుంచి అప్రమత్తం చేస్తున్నా స్వీయ నిర్ణయం తీసుకోకుండా యుద్ధ వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహా మేరకు ఎన్నికలకు వెళ్తున్నారని ఆక్షేపించింది. కొవిడ్ కట్టడి పని వదిలేసి రాష్ట్ర యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నం కాకతప్పని పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది.
ఎన్నికలు జరుగనున్న వరంగల్, అచ్చంపేట్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించింది. ప్రజల ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికలు ముఖ్యమా? అని ఎన్నికల సంఘాన్ని నిలదీసింది. ఎన్నికల ప్రచారాన్ని రాత్రి 7 గంటలకే ముగించాలని ఆంక్షలు విధించామని, ఎన్నికలకు మూడు రోజుల ముందే ప్రచారం నిలిపేశామని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది విద్యాసాగర్ చెప్పారు. ర్యాలీలను నియంత్రించడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందని ధర్మాసనం ఆక్షేపించింది. కేసులు పెరుగుతున్నపుడు ఏప్రిల్ 27 వరకు ప్రచారం చేసుకోడానికి అవకాశం ఎందుకు కల్పించారని నిలదీసింది. ప్రచార సమయాన్ని కుదించే అధికారాన్ని ఎందుకు వినియోగించుకోలేదని ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయడానికి మార్చిలోనే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. విపత్కర పరిస్థితుల్లో నిలుపుదల చేయడం ఎన్నికల కమిషన్ నిర్వహించాల్సిన చట్టబద్ధమైన విధుల్లో ఒకటని స్పష్టం చేసింది.
‘‘ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా కరోనా రెండో అల దేశాన్ని, రాష్ట్రాన్ని చుట్టుముట్టిన విషయాన్ని ఎన్నికల సంఘం గుర్తించలేదా? ప్రజలు పెద్దఎత్తున మరణిస్తున్నా ఎన్నికలపై ఎందుకు ముందుకు వెళ్లారు? బెంగాల్‌లో ఎన్నికల తర్వాత సునామీలా కరోనా చుట్టేస్తోంది. ఇక్కడి ప్రజలు కూడా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లాలనుకుంటున్నారా?’’ అని ధర్మాసనం నిలదీసింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసిన ఫిబ్రవరి 21 నుంచి పరిస్థితులు మారుతున్నా వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకోకుండా ఏప్రిల్ 16న నోటిఫికేషన్ జారీ చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఆ తర్వాత కూడా పరిస్థితులను పునఃసమీక్షించి తెలివైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైందని ఆక్షేపించింది.. ఇలా పలు అంశాలపై న్యాయ స్థానం ఈసీపై ప్రశ్నల వర్షం కురిపించింది.