iDreamPost
iDreamPost
త్వరలో ఓటిటిలో విడుదల కావాల్సి ఉన్న విశాల్ కొత్త సినిమా చక్రకు కోర్టు బ్రేకులు వేసింది. ఇతని గత సినిమా యాక్షన్ వల్ల తీవ్రంగా నష్టపోయామని తమకు హీరో 8 కోట్ల దాకా బాకీ ఉన్నాడని దాని నిర్మాణ సంస్థ ట్రైడెంట్ వేసిన కేసు వల్ల విశాల్ కు నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో రేపో ఎల్లుండో ప్రకటన ఇద్దామనుకున్న చక్ర యూనిట్ కు గట్టి షాక్ తగిలింది. గత ఏడాది వచ్చిన యాక్షన్ తెలుగులోనూ విడుదలయ్యింది. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ని టైటిల్ కి తగ్గట్టే చాలా భారీ బడ్జెట్ తో నిర్మించారు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. రెండు భాషల్లోనూ నష్టాలు తప్పలేదు.
అప్పటికే విశాల్ మార్కెట్ కొంత డౌన్ లో ఉంది. అభిమన్యుడు తప్ప దానికి ముందు వెనుక వచ్చినవన్నీ యావరేజ్ లేదా ఫ్లాప్ అయినవే తప్ప హిట్ అని ఏ ఒక్కటీ అనిపించుకోలేదు. దీని ప్రభావం యాక్షన్ మీద ఎక్కువగా పడింది. ఫలితంగా ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపిస్తే మిక్స్డ్ టాక్ ఆపై కోలుకునే అవకాశం ఇవ్వలేదు. దీంతో ట్రైడెంట్ కు లాస్ తప్పలేదు. మాములుగా ఇలాంటి వివాదాలు థియేట్రికల్ విడుదల సమయంలో చూస్తూ ఉంటాం. కానీ ఇలా ఓటిటి రిలీజుకు కూడా ఇలాంటి బ్రేక్ పడటం విశేషమే. విశాల్ దీన్ని ఎలా సెటిల్ చేసుకుంటాడో వేచి చూడాలి. ఎలాగూ డిజిటల్ డీల్ భారీగా కుదిరిందని చెన్నై టాక్. అలాంటప్పుడు ఒకవేళ ఇతను నిజంగా ఆ సంస్థకు కమిట్ మెంట్ ఇచ్చి ఉంటే రాజీ పద్ధతిలో ఎంతో కొంత ఇచ్చేసి రూట్ క్లియర్ చేసుకోవడం ఉత్తమం.
అసలే కోలీవుడ్ లో విశాల్ మీద తీవ్ర ఆగ్రహావేషాలతో ఉన్న వర్గాలు చాలా ఉన్నాయి. అవి దీన్ని అవకాశంగా తీసుకునే ఛాన్స్ లేకపోలేదు. అయితే చక్ర హక్కులు కొన్ని డిజిటల్ సంస్థ ఇది తమ స్వంత ప్రొడక్షన్ అని హీరో గత సినిమా బిజినెస్ తాలూకు వ్యవహారాలకు తాము ఎలా బాధ్యత వహిస్తామని కనక చెబితే కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. దానికి ఛాన్స్ తక్కువ. ఎందుకంటే చక్రను ఇప్పటిదాకా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ మీద నిర్మించినట్టు పబ్లిసిటీ చేస్తూ వచ్చారు. అలాంటప్పుడు ఈ వెర్షన్ చెల్లకపోవచ్చు. మరి చక్రకు రూట్ ఎలా క్లియర్ అవుతుందో వేచి చూడాలి. జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన చక్ర ద్వారా ఎంఎస్ ఆనందన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ నూ సమాంతరంగా విడుదల చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు.