ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరిస్తూ కొట్టివేసింది.
వివరాల్లోకి వెళితే ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తుందని ఏసీబీకి ఈ కేసులో ఎలాంటి సంబంధం ఉండదని రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఏసీబీ కోర్టు ఓటుకు నోటు కేసు అవినీతే నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 8 కి వాయిదా వేసింది. నిందితులందరు ఫిబ్రవరి 8 న తప్పనిసరిగా కోర్టు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన సంవత్సరం తర్వాత జరిగిన తెలంగాణా శాసనమండలి ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టి టిడిపి అభ్యర్థికి మద్దతుగా ఓటు వేసేందుకు రూ.50లక్షలు లంచం ఎర చూపారు. అప్పట్లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి 50 లక్షల లంచం ఇస్తూ ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో కూడా ఫోన్ లో మాట్లాడించినట్లుగా ఆడియో, వీడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
అనంతరం జరిగిన పరిణామాల్లో ఓటుకు నోటు కేసులో ఎ4 నిందితుడుగా ఉన్న జరుసలేం మత్తయ్య చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేశారు. ఈ కేసులో తాను అప్రూవర్ గా మారినందుకు తనని చంపేందుకు కుట్ర జరుగుతుందని, చంద్రబాబు, రేవంత్ రెడ్డి వర్గం నుండి తనకు ప్రాణ హాని ఉందని కావున ఈ కేసు పూర్తి అయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని కోరుతు మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించడం కూడా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. తాజాగా రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో పాటు అభియోగాల నమోదు కోసం విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేయడంతో ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో తెలియాలంటే ఫిబ్రవరి 8 వరకు వేచి చూడాల్సిందే.