iDreamPost
iDreamPost
బీజేపీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కొడుకు చిక్కుల్లోపడ్డారు. ఆయన మీద నమోదయిన గృహహింస కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. రూ కోటి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కన్నా నాగరాజుపై ఆయన భార్య లక్ష్మీ కీర్తి వేసిన కేసులో విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. నాగరాజు తీరు మీద చాలాకాలంగా ఆయన భార్య ఆరోపణలు గుప్పించారు. చివరకు న్యాయపోరాటంలో ఆమెకు అనుగుణంగా తీర్పు రావడంతో కన్నా కుటుంబం వార్తల్లోకెక్కింది.
కన్నా నాగరాజు, శ్రీలక్ష్మీ కీర్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006లో పెళ్లి తర్వాత వారికి 2013లో కూతురు కూడా పుట్టింది. అయితే పెళ్లి తర్వాత కొంతకాలం అంతా సవ్యంగా సాగిందని కీర్తి తెలిపారు. కానీ అత్త వేధింపులు మాత్రం ఎదుర్కోవాల్సి వచ్చేదని ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ భార్య కోడలిని వేధించడంతో పాటుగా లక్ష్మీకీర్తి తల్లిదండ్రులను కూడా ఇంట్లోకి రానివ్వలేదని అభియోగాలున్నాయి. అందుకు తోడుగా వివాహేతర సంబంధాలు పెట్టుకుని తనను భర్త కూడా వేధించారని ఆరోపించారు. దానిపై నిలదీసినందుకు 2015 మార్చిలో తనను కొట్టారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు, తన కుమార్తెకి రక్షణ కల్పించాలని, నివాస వసతి కల్పించి, వైద్యఖర్చులు ఇప్పించాలని, గృహహింస చట్టం కింద పరిగణించాలని ఆమె కోరారు. ఈ కేసులో ప్రతివాదులుగా కన్నా నాగరాజుతో పాటుగా తల్లిదండ్రులు కన్నా లక్ష్మీనారాయణ, విజయలక్ష్మీని కూడా ప్రస్తావించారు.
ఈ కేసులో విచారణ చేసిన విజయవాడ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శ్రీలక్ష్మీ కీర్తికి రక్షణ కల్పించాలని ఉత్తర్వులు ఇచ్చింది. అందుకు తోడుగా ప్రతివాదుల ఇంట్లోనే ఆమెకు వసతి ఇవ్వాలని పేర్కొంది. లేనిపక్షంలో నెలకు రూ. 50 వేలు అందించి ప్రత్యామ్నాయ వసతి ఇవ్వాలని తెలిపింది. కుమార్తె వైద్యం నిమిత్తం రూ. 50 వేలు అందించాలని ఆదేశించింది. వాటితో పాటుగా ప్రతివాదులు ముగ్గురూ కలిసి రూ. కోటి ని పరిహారంగా మూడు నెలలలోపు అందించాలని ఆదేశించింది. దాంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ ఆసక్తి రేపుతోంది. బీజేపీ కీలక నేత మీద కూడా అభియోగాలు నిర్ధారణ కావడం, పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి రావడం చర్చకు దారితీస్తోంది. కోడలిని గృహ హింస కేసులో హింసించిన నాయకుడు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పడం హాస్యాస్పదమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Also Read : కరోనా వేళ.. వీర్రాజు పర్యటన వెనుక అసలు లక్ష్యం ఏంటి?