తూర్పుగోదావరి జిల్లా రాజమహేద్రవరంలో దారుణం చోటు చేసుకుంది. దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నగరంలోని 9వ డివిజన్ ఏవీ అప్పారావు రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశంలో దంపతులిద్దరూ సజీవ దహనమై కనిపించారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతులు ఆటో డ్రైవర్ రాజేష్ దంపతులుగా పోలీసులు గుర్తించారు. కిరోసిన్ పోసుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని నిర్థారించారు. కరోనా భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వారు రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరోనాపై ప్రజల్లో నెలకొన్న భయానికి అద్దం పడుతోంది. ప్రభుత్వం, మీడియా కరోనాపై అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో భయాందోళనలు మాత్రం తగ్గడంలేదు. ఆ పేరు తలుచుకుంటేనే వణికిపోతున్నారు. చిన్నపాటి దగ్గు, జలుబు వచ్చినా అది కరోనా అనే అనుమానంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జలుబు, దగ్గు వచ్చిన వారితో చుట్టు పక్కల వారు దూరంగా ఉండడం, వారికి కరోనా వచ్చిందనే ప్రచారం సాగుతుండడంతో అనుమానితులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. వైద్య సహాయం తీసుకుందాం, పరీక్షలు చేయించుకుందామనే ఆలోచన కూడా వారు చేయడంలేదు.
విద్యాధికులు, అధికారులు ఆయా లక్షణాలు ఉన్న వారు భయపడాల్సిన అవసరం లేదని, దగ్గు, జలుబు వచ్చినంత మాత్రన కరోనా కాదనే విషయం చెప్పడం వల్ల ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. కరోనా మహమ్మరి వ్యాపిస్తున్న తరుణంలో ఏపీలో ఉన్న వార్డు, గ్రామ వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరం.