iDreamPost
iDreamPost
దేశ అత్యున్నత న్యాయస్థానం అది.. దేశంలోని ఎవ్వరైనా న్యాయం కోసం చివరగా వెళ్లే చోటు అది.. ఏ కష్టమొచ్చిందో.. ఏ సమస్య బాధించిందో ఏమో.. సుప్రీంకోర్టు బయట, అందరూ చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించారు. భగవాన్ దాస్ రోడ్డు దగ్గర సుప్రీంకోర్టు కాంప్లెక్సు బయట జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
కిరోసిన్ పోసుకుని..
సోమవారం ఉదయం కోర్టు ప్రాంగణంలోకి రావడానికి ఓ మహిళ, మరో పురుషుడు ప్రయత్నించారు. అయితే గేట్ డీ దగ్గర కాపలా ఉన్న పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. లోనికి వెళ్లేందుకు కావాల్సిన డాక్యుమెంట్లు, సరైన కారణాలు లేవని వెనక్కి పంపేశారు. కానీ వాళ్లు ఇంకోసారి కూడా రావడంతో పొలీసులు నచ్చజెప్పి పంపారు. ఈ సమయంలో వారిద్దరూ తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని, నిప్పింటించుకున్నారు. అందరూ చూస్తుండగానే, కన్నుమూసి తెరిచేలోపు జరిగిందీ ఘటన. షాకైన పోలీసులు, స్థానికులు.. వెంటనే తేరుకుని మంటలను ఆర్పారు. ఇద్దరినీ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.
ఎవరు? ఎందుకు?
ఆత్మహత్యకు యత్నించిన పురుషుడు, మహిళ ఎవరనేది ఇంకా తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. కానీ అంతకు కొద్ది నిమిషాల ముందు వాళ్లిద్దరూ సుప్రీంకోర్టు లోనికి వెళ్లేందుకు ప్రయత్నిచారు. దీంతో వాళ్లిద్దరూ ఎవరు? లోనికి వెళ్లేందుకు ఎందుకు ప్రయత్నించారు? ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేంటి? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే వాళ్లిద్దరూ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇద్దరూ 20 నుంచి 30 ఏళ్ల లోపు వాళ్లేనని తెలుస్తోంది.
భద్రతా లోపం?
సుప్రీంకోర్టు గేటు బయట జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఢిల్లీలో అత్యంత భద్రత ఉండే చోటుకు ఇద్దరు వ్యక్తులు కిరోసిన్ తో రావడం, అత్యంత రద్దీ ఉండేచోట ఆత్మహత్యాయత్నం చేయడం భద్రతా లోపాలను ఎత్తి చూపుతోంది. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా రెండు సార్లు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించినా పోలీసులు వాళ్లను అనుమానించలేదు. పోలీసులు కొంచెం అప్రమత్తంగా ఉన్నా.. ఈ ఘటన జరిగేది కాదన్న అభిప్రాయం అన్నివైపుల నుంచి వ్యక్తమవుతోంది.
Also Read : విలువలతో సమున్నతం.. వాజపేయి జీవితం