అబ్బాయేమో సాఫ్ట్వేర్ ఇంజినీర్..అమ్మాయిది ఇంజినీరింగ్ పూర్తి అయింది. ఇద్దరికీ కరోనా లక్షణాలు లేకున్నా సరే కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు.
వాళ్ళిద్దరివి పక్క పక్క బెడ్స్ కావడంతో మాటలు కలిసాయి. మాటల మధ్యలో హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు యువకుడు తెలుపగా, అమ్మాయి మాత్రం ఉద్యోగాన్వేషణలో ఉన్నట్లు తెలిపింది. మాటల పరిచయం కాస్త మనసులు ఇచ్చిపుచ్చుకునే వరకూ వెళ్ళింది. దాంతో పాటు ఇద్దరి సామాజిక వర్గాలు కూడా ఒకటే కావడంతో తమ తల్లిదండ్రులకు ఆ యువతీ యువకులు తమ ప్రేమ విషయం తెలియజేసారు.
పెద్దలు కూడా వారి ప్రేమను గుర్తించి పెళ్లికి అంగీకారాన్ని తెలపడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 10 రోజుల చికిత్స అనంతరం వారికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించి వ్యాధి పూర్తిగా తగ్గిందని వైద్యులు తెలపడంతో ఈ నెల 25న పొన్నూరులోని ఒక దేవాలయంలో నిరాడంబరంగా కొద్దిమంది అతిధుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడం వల్లనే వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారి పెళ్లి పీటల వరకూ వెళ్లడం విశేషం..