iDreamPost
iDreamPost
లాక్ డౌన్ వల్ల ఓటిటి పరిశ్రమ ఏ స్థాయిలో ఊపందుకుందో చూస్తూనే ఉన్నాం. మార్చ్ నుంచి అప్రతిహతంగా కొత్త సినిమాలతో దండయాత్ర చేస్తూనే ఉంది. ఫలితాలు ఎలా వస్తున్నాయన్నది పక్కనపెడితే ఇంట్లో కూర్చుని ఫోన్ లోనో లేదా టీవీలోనో చూసే వెసులుబాటు ఉండటంతో హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా చందాలు కట్టిన ప్రతి ఒక్కరు దాదాపుగా అన్నింటినీ చూసేశారు. థియేటర్లు అక్టోబర్ 15 నుంచి తెరవబోతున్న పరిణామానికి డిజిటల్ సంస్థలు నెరవడం లేదు. పైపెచ్చు రిలీజుల సంఖ్య పెంచుతున్నారు. చిన్న సినిమాలకు ఇవి నిజంగానే వరంగానే మారాయి. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, 47 డేస్, భానుమతి రామకృష్ణ లాంటి సినిమాలు నేరుగా హాళ్లలోకి వచ్చి ఉంటే హక్కుల రూపంలో వచ్చినంత మొత్తం కలెక్షన్లుగా వచ్చేది కాదన్న మాట వాస్తవం.
ఇక వి, నిశ్శబ్దం సంగతి సరేసరి. ఈ విషయంలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లు ఆయా నిర్మాతలకు థాంక్స్ చెప్పాల్సిందే. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ వచ్చే నెల 20న ప్రైమ్ లో రాబోతున్న సంగతి తెలిసిందే. వినోద్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాపై అంచనాలేమి లేవు కంటెంట్ బాగానే వచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. ఇప్పటిదాకా థ్రిల్లర్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన ప్రైమ్ ఇకపై ఇలాంటి ఎంటర్టైనర్స్ ని తీసుకునే ప్లానింగ్ కూడా గట్టిగా చేస్తోందట. అందులో భాగంగానే మిడిల్ క్లాస్ మెలోడీస్ కు సుమారు 4 కోట్ల యాభై లక్షలకు డీల్ చేసుకున్నట్టు వినికిడి. ఇది అధికారికంగా వచ్చిన సమాచారం కాకపోయినప్పటికీ నిప్పు లేనిదే పొగరాదు చందంగా ప్రచారమైతే ఉంది. బడ్జెట్ కోణంలో చూస్తే ఇది బెస్ట్ డీల్.
చూసి చూడంగానే, జానులో నటించిన వర్ష బొల్లమ ఇందులో హీరోయిన్. ఆనంద్ దేవరకొండ దొరసానితో డెబ్యూ చేసినా దానితో ఆశించిన ఫలితం అందుకోలేదు. పెర్ఫార్మన్స్ విషయంలోనూ ఏమంత పేరు రాలేదు. గొంతు అన్నయ్యను పోలి ఉండటం తప్ప యాక్టింగ్ పరంగా చూస్తే ఇంకా చాలా ఇంప్రూవ్ కావాల్సి ఉందనే కామెంట్స్ గట్టిగా వచ్చాయి. ఇప్పుడీ మిడిల్ క్లాస్ మెలోడీస్ లో ఆ మైనస్ ని గట్టిగానే కవర్ చేశాడట. మొత్తానికి చిన్న బడ్జెట్ మూవీస్ కి కల్పతరువుగా మారిన ప్రైమ్ లాంటి సంస్థలు పెట్టుబడి పరంగా అటు ప్రొడ్యూసర్లకు, రిస్కు లేని వినోదం ఇస్తూ ఇటు ప్రేక్షకులకు సంపూర్ణ న్యాయం చేకూరుస్తున్నాయి. ఈ ఏడాది మిగిలిన చివరి మూడు నెలల్లో తెలుగులో ఆకాశమే నీ హద్దురా తర్వాత తెలుగు ప్రైమ్ లో రాబోయే డైరెక్ట్ ఓటిటి రిలీజ్ మిడిల్ క్లాస్ మెలోడీస్ ఒక్కటే. ఇంకొన్ని ఖరారు కావాల్సి ఉంది.