iDreamPost
iDreamPost
ఏపీలో సంక్షేమ పాలనతో వైఎస్ జగన్ ప్రభుత్వ ఇప్పటికే తనదైన ముద్రవేసింది. ఇప్పటి వరకు పాలన అందించిన అందరికంటే సమున్నతంగా జనం మదిలో చోటు చేసుకుంది. ప్రత్యర్ధి వర్గాలకు కూడా వంక పెట్టేందుకు అవకాశం ఇవ్వకుండా దూసుకుపోతోంది. దాదాపుగా ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ వినూత్నమైన విధానాలు అవలంభిస్తూ పేదవాడికి సర్వ సేవలు అందించడమే లక్ష్యంగా కార్యాచరణతో ముందుకు నడుస్తోంది. అయితే వ్యవస్థల్లోని కొందరి వ్యక్తుల స్వార్ధం కారణంగా ప్రభుత్వానికి కొన్ని సార్లు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా అధికార యంత్రాంగంలో చోటు చేసుకుంటన్న అవినీతి కారణంగా ప్రత్యక్ష సేవలు పొందే ప్రజల నుంచి కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కోవిడ్ 19 కారణంగా తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. రాష్ట్రం ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కోవిడ్ రోగులకు అందించే సేవల్లో సీయం వైఎస్ జగన్ ఎటువంటి రాజీ పడడం లేదు. టెస్టులు, పాజిటివ్ రోగులకు అందించే మందులు, క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలు, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎంతో మెరుగ్గానే అందిస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలు, ప్రత్యర్ధి పార్టీలకు చెందిన నాయకులు కూడా ఈ విషయంపై ప్రభుత్వాని అభినందించారు.
అయితే కొన్ని చోట్ల క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం కారణంగా ఆయా ప్రాంతాల్లో విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో టెస్టింగ్ కిట్‌లు మాయం కావడం అటువంటిదే. క్షేత్రస్థాయి సిబ్బంది చేతి వాటమే దీనికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. ఇంకా మరింత లోతైన దర్యాప్తునకు కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
అలాగే ఒంగోలు క్వారంటైన్ సెంటర్‌లో ఆహారం సక్రమంగా లేదన్నది అక్కడి వారి ఆరోపణ. అయితే ఆహారాన్ని అందించే కాంట్రాక్టర్ కక్కుర్తి కారణంగా ఈ సమస్య ఏర్పడిందంటున్నారు. ఒక్కో రోగిపై రూ. 400లకు పైగా జగన్ సర్కారు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ కాంట్రాక్టర్ కక్కుర్తి పడడం క్షమించరాని నేరం. ఇటువంటి పరిస్థితులు పలు క్వారంటైన్ సెంటర్లలో జరుగుతున్నాయని ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు.
కోవిడ్‌ను ఎదుర్కొనే క్రమంలో సమగ్రంగా అందుతున్న సేవలతో పోలిస్తే చూస్తే అక్కడక్కడా దొర్లే ఇటువంటి పొరపాట్లను పరిగణనలోకి తీసుకోవాల్సినవి కాకపోయినప్పటికీ, ప్రతిపక్ష పార్టీలకు ఇవే ఆయుధాలుగా మారుతున్నాయి. వారు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నాయి. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పై స్థాయిలోని అధికారులు నేరుగా పర్యవేక్షించి చర్యలు ఉపక్రమిస్తే మరోసారి ఇటువంటి తప్పులు జరిగేందుకు అవకాశం ఉండదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వెనువెంటనే చర్యలకు ఆలస్యమవుతోంది. దీంతో కక్కుర్తి పడేవారిపై చర్యలు కూడా ఆలస్యమవుతున్నాయి. ఇది తప్పుడు సంకేతాలకు కారణమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.