iDreamPost
iDreamPost
కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి విశ్వాన్ని చుట్టుముట్టింది. ఆ దేశం…ఈ దేశం…ఆ ద్వీపం…ఈ ద్వీపం అని తేడా లేకుండా ప్రజలున్న ప్రతి చోటకి చొచ్చుకుపోయింది. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. మానవాళి ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ఇలా సమస్త ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు, ప్రజల జీవనోపాధి తీవ్రమైన సంక్షోభంలో పడ్డాయి. ఆకలి చావులకు దారి తీసింది. ఇలాంటి మహమ్మారి అమెజాన్ అడవుల్లో ఉన్న ఆదివాదులపై విజృంభిస్తుంది. వారి పాలిట మృత్యువు అయింది.
అమెజాన్‌లో ఆదివాసుల పుట్టుక.. చావు రెండు అడవి తల్లి ఒడిలోనే.. తమకు సోకిన వ్యాధి ఎంత ప్రమాదకరమైందో కూడా వారికి తెలియదు. వైద్య శాలలు, వెంటిలేటర్లు, మాస్క్ లు, శానిటైజర్లు అనేవి వారి జీవితంలో చూసి ఉండరు. అలాంటి స్వచ్ఛమైన అడవి బిడ్డలకు కరోనా మహమ్మారి గజగజలాడిస్తుంది. పెద్ద పెద్ద జంతువులకు భయపడని ఆ ఆదివాసులు…కరోనా భూతానికి భయపడుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివాసీ నృత్యాలు చేసిన అడవి బిడ్డలు…కరోనా కరాళ నృత్యానికి ఇప్పుడు బయపడుతున్నారు.
ఆ అడవిలో కార్చిచ్చు వచ్చినా.. కరోనా వచ్చినా పాలకులు కనికరించడం లేదు. అన్నీ తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా వల్ల ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో ఆదివాసులు పిట్టల్లా రాలిపోతున్నారు.
కరోనా మహమ్మారి అమెజాన్ అడవుల్లోని ఆదివాసులకు సోకింది. ఏప్రిల్ మొదటి వారంలో కోకామ తెగకు చెందిన 20 ఏళ్ల యువకుడికి సోకింది. అమెజాన్‌లో ఇదే తొలి పాజిటివ్ కేసు. ఆ తరువాత క్రమంగా విస్తరిస్తోందని ‘ఆర్టిక్యూలేషన్ ఆఫ్ ఇండిజినియస్ పీపుల్స్ బ్రెజిల్’ (ఎపిబిఐ) అనే సంస్థ పేర్కొంది. ఈ సంస్థ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు అమెజాన్ అడవుల్లో 980 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. వీరిలో 125 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే 12శాతానికి పైగా మరణించారు. బ్రెజిల్‌లో సగటు మరణాల కంటే ఇది రెట్టింపు. అక్కడి ప్రభుత్వ లెక్కలు మాత్రం 695 మందికి వ్యాధి సోకితే కేవలం 34 మందే మరణించినట్లు చెబుతున్నాయి. వీరంతా ప్రభుత్వం నడిపే క్లీనిక్‌ల వద్ద రిజిస్టర్ చేసుకొన్న వారు మాత్రమే. ఈ లెక్కల్లోకి రానివారు చాలా మంది ఉన్నారు. ఈ అడవుల్లో దాదాపు 9లక్షల మంది ఆదివాసులు నివశిస్తున్నారు.
ఈ అడవుల్లో టుక్సా అనే తెగ ఉంది. వీరి జనాభా 1,400 మాత్రమే. ఇక్కడి వారు ఆసుపత్రికి వెళ్లాలంటే నాలుగున్నర గంటలు ప్రయాణించాలి. అది కూడా రోడ్డు మార్గంలో వెళ్లడం సాధ్యం కాదు. విమానమో.. పడవలోను ప్రయాణించాలి. ఇన్ఫో అమెజోనియా లెక్కల ప్రకారం ఇక్కడ ఉన్న ప్రతి ఆదివాసి తెగ గ్రామం నుంచి ఆసుపత్రికి వెళ్లాలంటే సగటున 315 కిలోమీటర్లు ప్రయాణించాలి. అమెజాన్‌లోని 60 తెగల్లో ఇప్పటికే కరోనా కేసులు నమోదయ్యాయి. 106 మంది ఉన్న కంబేబా అనే గ్రామంలో 16 కరోనా కేసులు వచ్చాయంటే పరిస్థతి అర్థం చేసుకోవచ్చు. కానీ వీరిని ఆదుకోవాల్సిన పాలకులు గాలికొదిలేశారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిరక్షరాస్యత కారణంగా కరోనా నిబంధనలు అమలు జరగటం లేదు. పాలకులకు కూడా ప్రత్యేక శ్రద్ధ కూడా లేదు..
అమెజాన్ అడవుల్లో ఒకపక్క కరోనా విలయతాండవం చేస్తోన్నా…మరోపక్క ప్రకృతి సంపద దోపిడీ ఏమాత్రం ఆగలేదు. జైర్ బొల్సొనారో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అడవుల నరికివేత, అక్రమ మైనింగ్ పెరిగిపోయింది. గత ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో అడవుల నరికివేత 64శాతం పెరిగింది. గత నెలలోనే 156 చదరపు మైళ్ల అడవిని నరికేశారు. ఇప్పటికీ కలప అక్రమ రవాణా జరుగుతోంది. మరోపక్క వైరస్ ఉన్నా కానీ అడవుల నరికివేతకు వీలుగా చట్టాలను తెచ్చేందుకు బొల్సొనారో ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.