Idream media
Idream media
ఈ మధ్య మాట్లాడ్డానికి మనుషులు లేకపోయే సరికి కుక్కలతో, పిల్లులతో మాట్టాడ్డం ప్రారంభించాను. సౌలభ్యం ఏమంటే అవి మన మాటల్ని ఖండించవు, వాదించవు, అంగీకరించవు. మనలాగా ఒక పదం వాడాల్సిన చోట వంద పదాలు వాడవు. ఈ మధ్య ఒక మిత్రుడు ఫోన్‌లో కరోనా కవితను వినిపించాడు. రెండు రోజులు జ్వరం వచ్చింది. మా అపార్ట్‌మెంట్ గజగజ వణికింది. కవిత్వంతో సమస్య ఏమంటే , రాయడం తెలిసిన వాళ్లు తక్కువ రాస్తారు, రానివాళ్లు ఎక్కువ రాస్తారు. ప్రపంచంతో ఉన్న సమస్య ఇదే. చిత్రలిపి తెలియని వాడు కుంచె, అక్షర రహస్యం తెలియని వాడు పెన్ను పట్టుకుంటాడు. దీంట్లో నేనూ ఒకడ్ని. ఇది తెలిసే సరికి చాలా పెన్నులు విరిగిపోయాయి. సస్పెన్స్ సినిమాల్లో ఆఖరున విలన్ ఎవరో తెలిసినట్టు, చాలా కాలం ఒక రంగంలో కృషి చేసిన తర్వాత , ఆ రంగానికి మనమే విలన్ అని అర్థమవుతుంది. జీవితమనే రంగస్థలంలో ప్రాంప్టింగ్ ఉండదు. ఎవడి డైలాగ్ వాడే ఇన్‌స్టంట్‌గా క్రియేట్ చేసుకుని మాట్లాడాలి. ఒక వేళ ప్రాంప్టింగ్ అడిగితే , మనది రాముడి పాత్ర అయితే రావణుడి డైలాగ్ అందిస్తారు. ఏమార్చడం తెలిసిన వాడికి డైలాగ్ మార్చడం రాదా?
మంచి సాహిత్యం గురించి ఎవరూ మాట్లాడ్డం లేదని ఈ మధ్య ఒక మిత్రుడు వాపోయాడు. రచయితలు ఇతరుల రచనలు చదవడం మానేసి చాలా కాలమైంది. తమవి మాత్రమే చదువుకుని , తమని ప్రపంచం అంతా చదవాలని కోరుకుంటున్నారు. దాంతో పాట మాయమై కోరస్ మిగులుతోంది. కరోనాతో భాజాభజంత్రీలకి పని తగ్గిపోయిందని అంటున్నారు కానీ, ఆ ధ్వనులు, ప్రతిధ్వనులు ఫేస్‌బుక్, వాట్సప్‌లో వినిపిస్తున్నాయి. గద్దర్, ఘంటశాల ఏకకాలంలో కచేరి చేస్తున్నట్టు ఏ వాయిద్యం ఎక్కడ్నుంచి మోగుతుందో తెలియడం లేదు.
వచ్చిన దారిని మరిచిపోవడం మానవ నైజం. నేను వెళ్లే దారిని కూడా మరిచిపోతాను. కుక్కలు, పిల్లులతో నా సంభాషణ అని ప్రారంభించి దారి తప్పాను. ఈ మధ్య OTT సినిమాలు ఇలాగే ఉన్నాయి. నెల్లూరు వారి ఫోకసింగ్ లైట్లతో ప్రారంభమై, సెల్‌ఫోన్ వెలుతురుతో ముగుస్తాయి. ఆఫ్ చేసుకునే సౌకర్యం ఉన్నప్పటికీ అప్పడం, వడియంలా నంజుకుంటున్నాయి. సాహో సినిమాలో నేను గురక పెట్టి నిద్రపోయాను. ఇంతకంటే నికార్సుగా ఏ ప్రేక్షకుడు తన అభిప్రాయాన్ని చెప్పలేడు.
నెల్లూరంటే గుర్తొచ్చింది. మురళీకృష్ణ, కోమలి, రియాజ్ బిరియాని. చాలా ఏళ్ల క్రితం మిత్రుడు ఉమామహేశ్వరరావుతో మురళికృష్ణకి వెళితే చేపల పులుసు ఆర్డర్ ఇచ్చాడు. బాగుంటుందా అన్నాను. ఇంట్లో ఉన్నట్టే ఉంటుందన్నాడు. క్యాన్సిల్ చేసి ఆర్డర్ మార్చాను. ఇంట్లో ఉన్నట్టే ఉంటే మళ్లీ మురళికృష్ణ ఎందుకు? ఇక కోమలిలో టిఫెన్ చేసి కాఫీ తాగితే , అవన్నీ గత జన్మ స్మృతులు. రియాజ్ బిర్యాని గురించి చెప్పేది కాదు…అది తినేది.
మనం దేన్నుంచి పారిపోవాలనుకుంటామో, దాంట్లోనే బందీ అయిపోతాం. ఇది ప్రకృతి నియమం. ఇంతకు ముందు ఎవరికి ఫోన్ చేసినా పగలు ట్రాఫిక్‌లో, సాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో ఉన్నామనేవాళ్లు. ఇంట్లో అనే మాట అరుదుగా వినిపించేది. ఇల్లు ఇప్పుడు అరిగిపోయిన రికార్డ్. ప్రతివాడూ ఇంట్లోనే పక్షులకి పంజరాలు, జంతువులకి బోన్లు తయారు చేసిన పాప ఫలితం కిటికీ ఊచల్లోంచి కనిపిస్తోంది.
వెనుకటికి పాముకి, ముంగిసకి ఫైటింగ్ పెడతానని చివరి వరకూ ఊరించి , పాము మూలికల్ని అమ్మేవాడు. పాముకి ఆ మూలికల్ని చూపిస్తే పారిపోతుందట. పాము కనిపిస్తే మనం పారిపోతాం కానీ, తీరిగ్గా జేబులోంచి మూలిక తీస్తామా? ఈ చిన్న లాజిక్ మిస్ అయి ఎన్నిసార్లు మూలికలు కొన్నానో. అదంతా గారడి వాడి మాటల మహిమ.
పది మందిని మాయ చేస్తే గారడి, వంద కోట్ల మందిని మోసం చేస్తే మోడీ. చప్పట్లు కొట్టాం, కేకలు పెట్టాం, దీపాలు వెలిగించాం. చివరికి ఎవడి కరోనాతో వాడే యుద్ధం చేయాలని అర్థం చేసుకున్నాం. అన్నప్రసాదం పెట్టండి అని అడిగితే ముందు గుడి కట్టిన తర్వాతే అంటున్నాడు. అది చైనా కరోనా, ఇండియన్ మైథాలజీ తెలియదు. గుడి కట్టినా వదలదు, బడి మూసినా వదలదు.
వెనుకటికి ఒకాయన తన చేతితో గరుడ రేఖ ఉందని అది చూపిస్తే పాము ఆగిపోతుందని అనేవాడు. చాలా పాములు ఆగేవి కూడా. ఒకరోజు ఒక పాము ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసినట్టు ఎగిరి గరుడ రేఖ మీద కొట్టింది. ఈయన గరుడు పురాణం చదివినాడు కానీ, పాము చదవలేదు. కట్ చేస్తే గవర్నమెంట్ ఆస్పత్రికి పోయాడు. అక్కడ చీమ కరిస్తేనే మందు లేదు.
మా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు మనుషుల కంటే కుక్కలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుక్కల్లో కూడా జరుగుబాటు ఉండేవి, లేనివి. మాంసం దుకాణాల దగ్గర తచ్చాడే సమూహాలకు కరోనా ఎఫెక్ట్ లేదు. టిఫెన్ సెంటర్లు, హోటళ్ల దగ్గర ఉన్న వాటికి మహమ్మారి అంటే ఏంటో అర్థమైంది. కుక్కల నియమం ఏమంటే ఎవరి అడ్డాలో వాళ్లే ఉండాలి. గీత దాటితే మోతే.
కళా మెస్ మూతపడి చాలా కాలమైంది. సంగటి, చికెన్, మటన్, భోజనం దొరికేది. తక్కువ ధర కాబట్టి కాయాకష్టం చేసేవాళ్లు తినేవాళ్లు. దీన్ని నమ్ముకుని రెండు మూడు కుక్కలు జీవించేవి. యజమానులు కళ్లనీళ్లతో మెస్‌కి తాళం వేసి ట్రాలీ ఆటోలో సామాన్లు వేసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. వాళ్లు వస్తారని, అన్నం పెడతారని ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాయి.
ఏం చేయాలో తెలియక బస్కీలు తీస్తున్న కుక్కని పలకరించాను. కుక్కలకి ఐ క్యూ ఎక్కువ. మన భాష అర్థమవుతుంది కానీ, తిరిగి మాట్లాడ్డానికి ఇష్టపడవు. జీవితం ఎలాగుందని అడిగితే తోకతో జోరీగలు తోలుకుంటూ గుర్ర్‌ర్ర్ మంది. జర్నలిస్టుగా చాలా అనువాదాలు చేయడం వల్ల దీన్ని కూడా సులభంగా అనువదించాను.
అనువాదాల్లో సౌకర్యం ఏమంటే మనకి మూలభాష రావాల్సిన పనిలేదు. గుర్ర్‌ర్ర్ కి అర్థం ఏమంటే మీలాంటి గొప్పోళ్లు మమ్మల్ని పలకరించడమా అని. భోజనం సంగతేంటి అని అడిగాను. గుర్ర్‌ర్ర్‌ర్ర్ అని దీర్ఘం తీసింది. తమలాంటి ధర్మప్రభువుల దయ అని అనువాదం చేసుకున్నా. ఈ సారి ఇంకేదో చెప్పబోతే రెండు కోరలు బయటికి పెట్టి గుర్ర్‌ర్ర్ ఆపలేదు. నా అనువాదంలో ఏదో లోపం ఉందని గ్రహించాను.
అలాగే నిన్న రాత్రి ఒక పిల్లి తోట రాముడిలా దొంగగా ప్రవేశించింది. “ఏంటి సాహసం” అన్నాను. నేరం నాది కాదు, ఆకలిది అని చెప్పింది.
“నువ్వు సినిమాలు చూస్తావా?” అని అడిగాను.
“సినిమాలు, టీవీలు చూడకపోవడం వల్లే జంతువులు ఆరోగ్యంగా ఉన్నాయి. మనుషులే రోగగ్రస్తులవుతున్నారు”
“కరోనా ఎఫెక్ట్ ఎలా ఉంది?” అన్నాను.
“జీవితం బాగున్న వాళ్లకి కష్టమేమో కానీ, జీవితం ఎప్పుడూ బాలేని వాళ్లకి కొత్తగా వచ్చిన కష్టమేమీ లేదు”
పిల్లి ఫిలాసఫర్‌లా మ్యావ్‌మని నిట్టూర్చి
“ఇన్నాళ్లు సమస్త జీవాలను దుక్కించేలా చేశారు. వాటి కష్టం కనపడలేదు. ఇప్పుడు మనుషులకి కష్టం వస్తే, ప్రపంచానికే కష్టం వచ్చిందంటున్నారు. ఈ భూమి మీది మాత్రమే కాదు. మా అందరిదీ. మేం బాగనే ఉన్నాం. మీ చావు మీరు చావండి” అని వెళ్లిపోయింది.