iDreamPost
android-app
ios-app

171 దేశాలకు విస్తరించిన కరోనా

171 దేశాలకు విస్తరించిన కరోనా

కరోనా చాపకింద నీరులా దేశవ్యాప్తంగా నిశ్శబ్దంగా వ్యాప్తి చెందుతుండడంతో కేంద్రం ప్రభుత్వం తగు చర్యలు చేపట్టింది. దానిలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు కరోనా వైరస్ సంబంధిత అంశాలను పర్యవేక్షించడానికి నోడల్ ఆఫీసర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ నోడల్ అధికారిగా ఐఏఎస్ ఎస్. సురేష్ కుమార్ ను, తెలంగాణ నోడల్ అధికారిగా సంజయ్ జాజును కేంద్ర ప్రభుత్వం నియమించింది.

దేశ వ్యాప్తంగా 161 మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా కరోనా 14 రాష్ట్రాలకు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది. 5,700 మంది అనుమానితులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచి గమనిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 72 ల్యాబ్స్ లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర 47,కేరళ 27,ఉత్తర ప్రదేశ్ 17, కర్ణాటక 11,హర్యానా 16, తెలంగాణ 13, ఆంధ్రప్రదేశ్ 2,ఢిల్లీ 10,లడఖ్ 8, జమ్మూ 3, రాజస్థాన్ 4, తమిళనాడు 2,ఉత్తరాఖండ్ 1,ఒడిస్సా 1, పంజాబ్ లో 1 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణాలో ఇండోనేషియా నుండి వచ్చిన 8 మందికి కరోనా ఉన్నట్లు తేలడంతో కరీంనగర్ లో కలకలం రేగింది. దాంతో కరీంనగర్ లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ప్రజలు బయట తిరగొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇండోనేషియా వ్యక్తులు ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడ తిరిగారన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంగోలులో మరో వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్య శాఖ నిర్దారించింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా 8,943 మృత్యు వాత పడగా, 2,18,663 వైరస్ బారిన పడ్డారు. వైరస్ సోకిన వారిలో 6,921 మంది పరిస్థితి విషమంగా ఉంది. కరోనా బారి నుండి బయట పడిన వారు 84,383.. ఇప్పటికే కరోనా వైరస్ 171 దేశాలకు విస్తరించడంతో ప్రపంచ దేశాలు స్థంభించిపోయాయి. ఒక్క ఇటలీలోనే ఒక్కరోజులో 475 మంది మృత్యువాత పడటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. కాగా చైనాలో నిన్న ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.

దేశాల వారీగా చూస్తే చైనా 3,237, ఇటలీ 2,978, ఇరాన్ 1135,స్పెయిన్ 638,ఫ్రాన్స్ 264,అమెరికా 150,బ్రిటన్ 104,దక్షిణ కొరియా 84, నెదర్లాండ్స్ 58, స్విట్జర్లాండ్ 33,జపాన్ 29,జర్మనీ 28,ఇండోనేషియా 19, ఫిలిప్పీన్స్ 17,బెల్జియం 14,ఇరాక్ 12, స్వీడన్ లో 10 మంది కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు.