Idream media
Idream media
కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పరీక్షలు చేపట్టడంలో వేగం పెంచడం, నియంత్రణ కార్యక్రమాలకు తోడు ప్రతి రోజూ ప్రజలను అప్రమత్తం చేస్తూ కొవిడ్ కంట్రోల్ నుంచి కరోనాపై అవగాహన కలిగిస్తూ చేపడుతున్న ప్రచారంతో ఏపీలో వైరస్ తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు హెర్డ్ ఇమ్యూనిటీతో వైరస్ వ్యాప్తి తగ్గనుంది. ఈ మేరకు కొవిడ్ కంట్రోల్ రూమ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కూడా ప్రజలకు శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో 15 శాతం పైనే హెర్డ్ ఇమ్యూనిటీ గుర్తించినట్లు తెలిపారు. శనివారం నుంచి శీరోసర్విలెన్స్ భారీగా ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే చాలని ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
ఆ జిల్లాల్లో ఈ తేదీల నుంచీ..
కరోనా ఏజిల్లాలో ఎప్పుడు తగ్గుతుందో కూడా ప్రభాకర్ రెడ్డి తేదీల వారీగా చెప్పారు. ఆగస్టు 21 నుంచి కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో.. సెప్టెంబర్ 4 నుంచి గుంటూరు, కృష్ణా, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తగ్గుముఖం పట్టనున్నట్లు తెలిపారు. మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గుతుందని కొవిడ్ కంట్రోల్ రూమ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు.
హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి?
ఏదైనా ఒక వ్యాధి జనాభాలోని ఒక పెద్ద భాగంలో వ్యాపిస్తే, మనుషుల రోగ నిరోధక శక్తి ఆ వ్యాధి వ్యాపించకుండా అడ్డుకునేందుకు సాయం చేస్తుంది. అంటే, జనాభా ఆ వ్యాధితో పోరాడి పూర్తిగా కోలుకోగలరు. వారు ఆ వ్యాధి నుంచి ‘ఇమ్యూన్’ అవుతారు. అంటే వారిలో రోగ నిరోధక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. వారిలో ఆ వైరస్‌ను తట్టుకోగలిగే ‘యాంటీ-బాడీస్’ తయారవుతాయి.
‘హెర్డ్ ఇమ్యూనిటీ’ ఎలా జరుగుతుంది?
క్రమంగా జనం ‘ఇమ్యూన్’ అయ్యే కొద్దీ, వైరస్ వ్యాపించే ప్రమాదం కూడా తగ్గుతూ ఉంటుంది. దానివల్ల కరోనా రానివారికి, ఆ వ్యాధికి ఇమ్యూన్ కాని వారికి పరోక్షంగా రక్షణ లభిస్తుంది. అమెరికా హార్ట్ అసోసియేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎడ్వర్డ్ శాంచెజ్ తన బ్లాగ్‌లో దీనిని వివరించే ప్రయత్నం చేశారు. “ఒక మనుషుల గుంపు(ఇంగ్లిష్‌లో హెర్డ్)లో ఎక్కువ శాతం మంది వైరస్ నుంచి ఇమ్యూన్ అయిపోతే, అది వారి మధ్యలో ఉన్న వారి వరకూ చేరడం చాలా కష్టం అవుతుంది. అంటే, ఒక పరిమితి తర్వాత దాని వ్యాప్తి ఆగిపోతుంది. కానీ, ఆ ప్రక్రియకు సమయం పడుతుంది. దానితోపాటు ఏదైనా టీకా వేసే కార్యక్రమం సాయంతో అత్యంత సున్నితమైన వ్యక్తులు కూడా సురక్షితంగా ఉన్నారని నిర్ధరణ అయినప్పుడు దానిని హెర్డ్ ఇమ్యూనిటీగా భావిస్తారు. ఒక అంచనా ప్రకారం ఒక సమాజంలో 60 శాతం జనాభాకు కరోనా వ్యాపిస్తే, వారు దానితో పోరాడి ఇమ్యూన్ అయినప్పుడు కోవిడ్-19 నుంచి వారిలో హెర్డ్ ఇమ్యూనిటీ వృద్ధి చెందింది అని చెప్పచ్చు” అని తెలిపారు.