iDreamPost
android-app
ios-app

6 కాదట.. 26 అడుగులట

  • Published Aug 29, 2020 | 7:20 AM Updated Updated Aug 29, 2020 | 7:20 AM
6 కాదట.. 26 అడుగులట

కోవిడ్‌ 19 విషయంలో ప్రతీది సరికొత్తగానే వెలుగుచూస్తోంది. ఒకసారి అనుకున్నది ఆ తరువాత కాదని తేలుతోంది. దీంతో ఏది కరెక్టు అన్నది జనసామాన్యంలో తీవ్ర అయోమయం సృష్టిస్తోంది. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం తలకుమించిన భారం అవుతోంది. వరుసగా వెలుగు చూస్తున్నవాటిలో నిపుణులు చెబుతున్నవే అయినప్పటికీ వాటిని అనుసరించాలంటే జనానికి కాస్తంత కష్టమనే చెప్పాలి. అయినప్పటికీ వైరస్‌ ఛైన్‌ను బ్రేక్‌ చేయ్యాలంటే తప్పేలా లేదు.

కోవిడ్‌ 19 వైరస్‌ భారిన పడకుండా ఉండేందుకు ముఖ్యంగా భౌతిక దూరం, ముఖానికి మాస్క్, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేవి ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. వీటిలో ప్రతి దానికి నిర్ధిష్టమైన విధానాలున్నాయి. భౌతిక దూరం విషయంలో ఇప్పటి వరకు ఆరు అడుగుల దూరం ఉండాలన్న ప్రచారం విస్తృతమైంది.

అయితే ఇటీవలే జరిగిన ఒక పరిశోధనలో 26 అడుగుల దూరం వరకు కూడా వైరస్‌ ఉన్న తుంపరలు ప్రయాణించగల్గుతున్నాయని కనుగొన్నారు. దీంతో ఆరు అడుగుల నిబంధనను మార్చాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గతంలో కూడా కొన్ని నిర్ధిష్ట పరిస్థితుల్లో తుంపర్లు ప్రయాణించే దూరం ఆరు అడుగులకంటే ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ పరిశోధనలు మరింత విసృత పరచి 26 అడుగుల దూరం వరకు మనిషికీ మనిషికీ మధ్యన వైరస్‌ ఉన్న తుంపరలు ప్రయాణించగలవని గుర్తించారు.

ముఖ్యంగా గాలీ, వెలుతురు రాని ప్రదేశాలు, తలుపులు మూసి ఉంచే గదుల్లోనూ వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంటున్నది కూడా వెలుగులోకొచ్చింది. దీంతో ఇప్పటి వరకు అనుసరిస్తున్న నిబంధనల్లో మార్పులు వచ్చేందుకు కూడా అవకాశం ఏర్పడింది.

అలాగే వైరస్‌ సోకే విషయంలో కూడా పురుష, స్త్రీల మధ్య తేడాలున్నట్లుగా తేలింది. మహిళల్లో ఉండే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ కారణంగా వైరస్‌ ప్రభావం తక్కువగా ఉంటున్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే పురుషుల నాసికారంధ్రాలు, గుండె, ప్రేవులు, ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఉండే ఒక ఎంజైమ్‌ కారణంగా వైరస్‌ ఎక్కువగా సోకుతోందని తేల్చారు. పెద్దలో 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు బైటపడుతుండగా చిన్నారుల్లో కూడా వైరస్‌ సోకిన మూడు వారాల తరువాత దాని ప్రభావం కన్పిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉండగా వైరస్‌ వ్యాప్తి మాత్రం కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 77,266 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా గుర్తించారు. ఇటీవలి కాలంలో ఇదే అత్యధికం. దేశంలో మొత్తం 33,87,500లకు చేరుకుంది. వీరిలో యాక్టివ్‌ కేసులు 7,42,023గా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. మొత్తం మరణాల సంఖ్య 61,529గా అందులో పేర్కొంది. యాక్టివ్‌ కేసుల కంటే కోలుకుంటున్న వారు మూడున్నర రెట్లు అధికంగా ఉంది. ఇందుకు అనుగుణంగానే దేశ వ్యాప్తంగా రికవరీ రేటు పెరుగుతోంది. అలాగే మరణాల రేటు తగ్గుతోంది.