iDreamPost
android-app
ios-app

నాగార్జునసాగర్‌ ఎన్నికలో కరోనా క‌ల్లోలం

నాగార్జునసాగర్‌ ఎన్నికలో కరోనా క‌ల్లోలం

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌ నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో కూడా కలకలం రేపుతోంది. ప్రచారానికి ముందే కరోనా పాజిటివ్‌ రావడంతో నియోజకవర్గ ఎన్నికల అధికారిని మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రచారంలో ఉన్న కొందరరు నేతలను తాకింది. మిగిలిన అందరినీ భయపెడుతోంది. మండలాల వారీగా ప్రచారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో స్థానికంగా ఆందోళన ఏర్పడింది.

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీల నేతలూ అక్కడే మకాం వేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ వంటి ప్రధాన పార్టీల సహా ఇతరులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మాడ్గులపల్లి మండల ఇన్‌చార్జి, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సోదరుడు రాజేశ్వర్‌రెడ్డి, ఆర్మూరు జడ్పీటీసీ సంతోష్‌, నాయకులు తాటిపల్లి గంగారెడ్డి, మల్లారెడ్డి, రజనీష్‌తోపాటు వారి వంట మనిషికి కరోనా సోకిందట. అయితే, హోం క్వారంటైన్‌లో ఉండకుండా వారందరూ ప్రచారంలో పాల్గొంటున్నారట. దీనిపై కాంగ్రెస్‌ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

కరోనా పీడితులతో కలిసి ప్రచారం నిర్వహిస్తూ వ్యాధి వ్యాప్తికి కారకుడైన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై చర్య తీసుకోవాలని కోరారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ లెటర్‌హెడ్‌పై ఈ ఫిర్యాదు మాడ్గులపల్లి సీఐకి అందింది. అయితే పది రోజుల క్రితం తన వెంట ఉన్నవారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగానే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వారిని వెనక్కి పంపినట్టు సమాచారం. మరుసటి రోజే జీవన్‌రెడ్డి, ఇతర ముఖ్యులు మిర్యాలగూడలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. తాజాగా సాగర్‌ ఉప ఎన్నిక కీలక బాధ్యతల్లో ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

ఎన్నికల ప్రచారంలో లీడర్లు, కేడర్‌ తప్పనిసరిగా మాస్క్‌ పెట్టుకోవాలని పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. వారు పట్టించుకోవడం లేదు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ అయిన పోలీసుల్లో నల్లగొండ జిల్లాలో సుమారు 40 మంది ఫస్ట్‌వేవ్‌లో కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రస్తుతం వారు అత్యంత జాగ్రత్తతో ఉంటున్నారు. జనాలు గుంపులుగా ఉన్నా అంటీముట్టనట్టు వ్యవహరిస్తన్నారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం హాలియాలో లక్ష మందితో సీఎం కేసీఆర్‌ సభ నిర్వహించాలని అధికార టీఆర్‌ఎస్‌ కార్యాచరణ ప్రారంభించగా, 300 చిన్న సభలు, రోడ్‌ షోలు నిర్వహించేందుకు బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో పెద్ద సభలతో ప్రమాదమేనని, ఎక్కువమంది ఒక చోట చేరితే జాగ్రత్తలు పాటించడం అసాధ్యమని వివిధ శాఖల అధికారులు అంటున్నారు.