iDreamPost
android-app
ios-app

పోలీసులను కలవరపెడుతున్న కరోనా సెకండ్‌ వేవ్‌!

పోలీసులను కలవరపెడుతున్న కరోనా సెకండ్‌ వేవ్‌!

కరోనా సెకండ్‌ వేవ్‌ దేశ వ్యాప్తంగా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. మారిన వాతావరణంలో మహమ్మారి పంజా విసిరే అవకాశం ఉందన్న నిపుణుల మాటలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. తెలంగాణ పోలీసుశాఖలో సెకండ్‌ వేవ్‌ మొదలైనట్లు కనిపిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైరస్‌ బారి నుంచి తప్పించుకోలేకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

తాజాగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో ముగ్గురు అధికారులు గతంలో కరోనా సోకినవారే కావడం, అందరూ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నవారు కావడం గమనార్హం. వీరితో కలిసి పనిచేసిన మరో అధికారి, ముగ్గురు సిబ్బంది కొత్తగా కొవిడ్‌-19 బారినపడ్డారు. మరోవైపు పంజాగుట్ట ఠాణా మహిళా సిబ్బంది ఒకరికి కరోనా సోకింది. వీరంతా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన వారే. దీంతో సహచరులు పరీక్షలకు పరుగులు తీస్తున్నారు. కాగా, గతంలో ఎస్‌ఆర్‌ నగర్‌ ఠాణా సిబ్బంది 40 మంది కరోనా బారినపడి కోలుకున్నారు. అదేచోట మళ్లీ పాజిటివ్‌లు రావడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. కారణాలపై ఆరా తీస్తోంది.

ఎన్నికల విధులే కారణమైతే..?

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ల పరిధిలో పనిచేస్తున్న వేలాదిమంది పోలీసులు తొలి దశలో వైరస్‌కు గురయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోగా, మిగతావారు కోలుకున్నారు. అయితే, క్రమంగా పరిస్థితులు చక్కబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఇటీవలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది తీరిక లేకుండా బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. ఘర్షణల సందర్భంగా ఇరు వర్గాలను చెదర గొట్టాల్సి రావడం, చాలాచోట్ల భౌతిక దూరం విస్మరణ, నేతలు, అభ్యర్థులు కొవిడ్‌ నిబంధనలు ఖాతరు చేయకుండా ర్యాలీలు, సభలు, సమావే శాలు నిర్వహించడం.. పోలీసులకు ఇబ్బంది తెచ్చిపెట్టింది. కాగా, మూడు కమిషనరేట్ల సిబ్బందీ ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల విధుల కారణంగానే కరోనా వ్యాప్తి చెందినట్లు తేలితే కేసులు పెరిగే ప్రమాదం ఉంది. .