iDreamPost
android-app
ios-app

కులవృత్తులే ఆధారమా..!

  • Published Jul 27, 2020 | 4:24 AM Updated Updated Jul 27, 2020 | 4:24 AM
కులవృత్తులే ఆధారమా..!

2020లో కోవిడ్‌ 19 మహ్మారి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ముఖ్యంగా ఆధునిక ఆర్ధిక వ్యవస్థల పునాదుల మీద పుట్టుకొచ్చిన అనేకానేక వ్యాపారాలు ఎక్కడికక్కడే స్థంభించాయి. దేశంలో ఉద్యోగ కల్పనలో వ్యవసాయం తరువాత స్థానాన్ని ఆక్రమించిన భవన నిర్మాణ రంగం కూడా కోవిడ్‌ ధాటికి దెబ్బతింది. విద్య, వినోదం, పర్యాటకం, రియల్‌ ఎస్టేట్స్, షాపింగ్‌ మాల్స్‌ తదితర వాటిల్లో లక్షల కొద్దీ ఉద్యోగాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో గాల్లో దీపాలుగా మారిపోయాయి. వీటిలో కొన్ని చోట్ల వంతుల వారీ విధానంలో ఉద్యోగులను విధుల్లోకి రమ్మంటుండగా, మరికొన్ని సంస్థలు పూర్తిస్థాయిలో లే ఆఫ్‌లు ప్రకటించేసాయి. అదీ ఇదీ అని కాకుండా దాదాపు అన్ని రంగాలదీ ఇదే దారి.

ఆర్ధిక వ్యవస్థలో వచ్చిన మార్పులతో కొత్తగా పుట్టుకు వచ్చిన అన్ని ఉద్యోగాల్లోనూ కూడా అప్పటి వరకు గ్రామాల్లో వివిధ రకాల కులవృత్తుల/ చేతి వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళే ఉద్యోగాలు పొందారు. గ్రామీణ ప్రాంతాల్లోని చేనేత, వడ్రంగి, కుమ్మరి, నాయీ బ్రాహ్మణ, రజక తదితర అనేక వృత్తుల్లోకి కార్పొరేట్‌ సంస్థలు కాలుమోపాయి. అత్యంత కష్టంతో కూడుకున్న చేతి వృత్తి మీద పూర్తిస్థాయిలో ఆధారపడినప్పటికీ తగినంత ఆదాయం రాక, కుటుంబాలను గడపడం కష్టం కావడంతో పలువురు కుల వృత్తిదారులు, వ్యవసాయ రంగంలోని వారు కూడా ‘నయా’ ఉద్యోగాల్లోకి చేరిపోయారు. ఈ క్రమంలో ఏపీ టు ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాల టు ఏపీకి కొన్ని లక్షల కుటుంబాలు ప్రాంతాలు మారాయి. కొన్నేళ్ళుగా ఆయా ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్నాయి.

దాదాపు 10– 15 ఏళ్ళ క్రితం మొదలైన ఈ మార్పు 2019 వరకు అత్యుత్తమ స్థాయిలోనే కొనసాగిందని ఒక అంచనా. అయితే 2020 మార్చి తరువాత ఆయా ‘నయా’ రంగాలన్నీ ఉన్న పళంగా కుదుపునకు లోనయ్యాయి. కోవిడ్‌ 19 వైరస్‌ వ్యాప్తితో ఎక్కడికక్కడే స్థంభించి పోవడం, జనం మీద ఆధారపడ్డ లక్షల కొద్దీ ఉద్యోగాలు గాల్లో దీపాలుగా మారిపోయాయి. ఉన్న చోట పనికి గ్యారెంటీ లేక, ఒక వేళ ఉందామన్నా భవిష్యత్తుకు తగిన ఢోకా కన్పించకపోవడంతో వారంతా తమతమ సొంత ప్రాంతాలకు క్యూలు కట్టారు. లాక్డౌన్‌ ఎత్తేసాక ఒక్క హైదరాబాదు నగరం నుంచే దాదాపు 7 లక్షల మంది వరకు ఏపీలోని పలు జిల్లాలకు చేరుకున్నారని ఒక అంచనా. ఇలా చేరుకున్న వాళ్ళలో అత్యధిక శాతం మంది దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలకుచెందిన వారే.

ఇలా వచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఉపాధి లభించడం ఎలా? అన్న సమస్య ఎదురవుతోంది. ఇప్పటి వరకు తాము చేసిన ఉద్యోగం, సొంత గ్రామంలో లభించదు. దీంతో కుల/చేతి వృత్తులవైపు మళ్ళాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు పదిపదిహేనేళ్ళుగా తమతమ వృత్తులకు దూరమైన వీరంతా ఇప్పుడు ఆయా వృత్తుల్లో ఏ మేరకు ఉపాధి పొందగలుగుతారన్న ప్రశ్నను పక్కన బెడితే ఇప్పటికిప్పుడు కుటుంబాలను పోషించుకునేందుకు ఎదురుగా కన్పిస్తున్నవి కుల/చేతి వృత్తులేనని పలువురు విళ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో లక్షలాదిగా పల్లెలకు చేరిన కుటుంబాల ఉపాధికి భరోసా ఏంటన్నది రానున్న రోజుల్లోనే తేలాల్సి ఉంది.