iDreamPost
android-app
ios-app

బురద పూసుకుని శంఖం ఊదితే కరోనా సోకదు – బీజేపీ ఎంపీ

బురద పూసుకుని శంఖం ఊదితే కరోనా సోకదు – బీజేపీ ఎంపీ

కరోనా దేశంలో విజృంభించిన తరుణంలో కరోనా రాకుండా ఉండాలంటే కొన్ని రకాల చిట్కాలు పాటించండి అంటూ పలువురు రాజకీయ నేతలు రకరకాల ప్రకటనలు చేశారు.వాటిలో కొందరు ఆవు పేడతో కరోనా రాదని అంటే మరికొందరు గోమూత్రంతో కరోనా మందు తయారు చేయొచ్చని చెప్పారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అయితే బాబ్జి అప్పడాలు తింటే కరోనా రాదని ఒక వీడియోలో వెల్లడించారు. దురదృష్టవశాత్తు ఆయనకు కూడా కరోనా సోకింది.

ఇప్పుడు తాజాగా రాజస్థాన్ కి చెందిన బీజేపీ ఎంపీ సుఖ్ బీర్ సింగ్ జునాపురియా కొత్త వాదన తెరపైకి తెచ్చారు. బురదలో కూర్చుని శంఖం ఊదితే కరోనా మన దరి చేరదని ఆయన వెల్లడించారు. దానిపై విజయం సాధించాలి అంటే బురదలో కూర్చుని శంఖం ఊదాలని పేర్కొన్నారు.బురదలో కూర్చుని శంఖం ఊదుతూ చేసి చూపించారు కూడా.. అంతేకాకుండా ప్రజలకి అనేక సూచనలు ఇచ్చారు. ప్రజలు ఇంటికి పరిమితం కాకుండా బయట తిరగాల్సిన అవసరం ఉందని, ఎండకి ఎండి వానకు తడవాలని అప్పుడే మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఎంపీ తెలిపారు. బురదలో కూర్చుని శంఖం ఊదితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కరోనా వచ్చే అవకాశం ఉండదని సుఖ్ బీర్ సింగ్ పేర్కొన్నారు. 

ఆయన ఒళ్ళంతా బురద పూసుకుని శంఖం ఊదుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కరోనా వైరస్ బురదలో కూర్చుని శంఖం ఊదితే పోయేది అయితే ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ కోసం ఎందుకు ఎదురుచూస్తుంది అని కొందరు ఎంపీ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కొందరు కేంద్ర మంత్రులకు కరోనా సోకిందని నెటిజన్లు వెల్లడిస్తున్నారు. ఉదాహరణగా బాబ్జి అప్పడాలు తింటే కరోనా రాదని ప్రచారం చేసిన కొన్ని రోజులకే కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు కరోనా సోకిందని గుర్తు చేస్తున్నారు.