iDreamPost
iDreamPost
కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చే దిశగా సాగుతున్నాయి. దేశమంతా వైరస్ వ్యాప్తి విస్తరిస్తోంది. అన్ని రాష్ట్రాలలోనూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్ లాంటి తీవ్ర ప్రభావిత దేశాల కన్నా మించి ఇండియాలో కొత్త కేసులు వస్తున్నాయి. ఆ రెండు దేశాల కేసులతో పోలిస్తే 37 శాతం అదనంగా ఇండియాలో ఒక్క రోజు కేసులు పెరుగుతున్న తీరు విస్మయకరంగా మారుతోంది. ఇక ఆఫ్రో, ఆసియా దేశాలన్నింటికన్నా అత్యంత దుర్భరంగా కరోనా బారిన పడిన దేశం భారత్ కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇండియాలో ప్రస్తుతం అత్యధికంగా కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. దానికి ప్రధాన కారణం ఏపీలో నిర్వహించిన పరీక్షలు కావడం విశేషం. సగటున మిలియన్ ప్రజలకు నిర్వహించిన కేసులను పరిగణలోకి తీసుకుంటే ఏపీకి దరిదాపుల్లో ఏ రాష్ట్రం కనిపించడం లేదు. సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణా అయితే కనీస స్థాయిలో కూడా నిర్వహించిన పరిస్థితి లేదు. జాతీయ సగటు కన్నా దిగువన ఉంది. తెలంగాణాలో పరీక్షల నిర్వహణ జరగకపోవడం పట్ల పలుమార్లు ఐసీఎంఆర్ తో పాటు హైకోర్ట్ కూడా అభ్యంతరం పెట్టిన అనుభవం ఉంది.
ఏపీలో మాత్రం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ అనే మూడు విధానాల విషయంలో ప్రాధాన్యతనిచ్చారు. దానికి అనుగుణంగా క్రమంగా సదుపాయాలు మెరుగుపరిచాయి. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసులు 90వేలు దాటి ఉన్నాయి. అయినప్పటికీ అందరికీ అవసరమైన బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు వంటివి లోటు రాకుండా చేసే యత్నంలో ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తద్వారా 5.3లక్షల కేసులు నమోదయితే ఇప్పటికే 4.4 లక్షల కేసులు సుమారు కోలుకోవడం విశేషం. తద్వారా 80 శాతం పైగా రికవరీ రేటు కనిపిస్తోంది.
దాంతో పాటుగా సీరో సర్వే ప్రకారం సుమారు 20 శాతం మందికి కరోనా వచ్చి పోయిందని అంచనాకు వచ్చారు. ఇమ్యూనిటీ సహా ఇతర అంశాలు కలగలిపి కొందరిపై వైరస్ ప్రభావం చూపలేకపోయినట్టుగా ఇప్పటికే వైద్య నిపుణులు నిర్ధారించారు. అలాంటి వారి సంఖ్య ఏపీలో కోటి మంది ఉండడం గమనార్హం.
తద్వారా మొత్తం జనాభాలో ఇప్పటికే సుమారుగా 22 శాతం వరకూ కరోనా ని అధిగమిచినట్టుగా అంచనాలకు వస్తున్నారు. ఇది మరింత పెరిగితే హెర్డ్ ఇమ్యూనిటీ స్థాయికి చేరుతుందని ఆశిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో సగటు కొత్త కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. గత వారాంతానికి అది 17శాతంగా ఉంది. వంద మందికి పరీక్షలు నిర్వహిస్తే 17 మందికి కరోనా పాజిటివ్ గా నమోదయిన దశ నుంచి ప్రస్తుతం 14 శాతానికి పడిపోయింది. ఇక కృష్ణా, విజయనగరం వంటి జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన దాఖలాలు స్పష్టమవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో కొత్త కేసులు సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ సెప్టెంబర్ నెలాఖరు నాటికి రాష్ట్రమంతా పరిస్థితి మరింత అదుపులోకి రావచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి. తద్వారా ఏపీలో కరోనా విషయంలో ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఆశావాహకంగా కనిపిస్తుండడం కొంత ఉపశమనంగా చెప్పాలి.