iDreamPost
iDreamPost
ఏ ముహూర్తాన కరోనా అలియాస్ కోవిడ్ 19 వ్యాపించడం మొదలు పెట్టిందో గానీ ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. జీవన స్థితిగతులు, వాతావరణ పరిస్థితులు, ఆర్ధిక స్థితి తదితర అంశాల ఆధారంగా ఆయా దేశాలు నానా అగచాట్లు పడుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కరోనా సర్వసమానత్వం అమలు చేస్తోందనే చెప్పాలి. చిన్నా–పెద్దా, ధనిక–పేద వంటి తారతమ్యాలు ఏమీ లేకుండా కొమ్ములు తిరిగిన నేతలను కూడా చేతులెత్తించేస్తోంది. అందరికంటే ముందగానే మేల్కొన్న మనదేశంలోనైతే లాక్డౌన్ పుణ్యమాని వ్యాప్తిని గణనీయంగా తగ్గించగలిగామనే చెప్పాలి.
అయితే లాక్డౌన్‌ఎత్తివేసిన తరువాత ఇప్పటి పరిస్థితుల్ని అంచనా వేసి భవిష్యత్ పరిస్థితులను ఊహిస్తే మాత్రం ఆందోళనను పెంచుతున్నాయి. జులై–సెప్టెంబర్ నెలల మధ్య కరోనా వేవ్ విస్తృత మవుతుందన్న నిపుణుల అంచనాలు మరింత ఆందోళనలను పెంచుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం దేశంలో అయిదున్నర లక్షలకు చేరువలో పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకుంది. ప్రతి రోజూ వేలల్లోనే కేసులు నమోదవుతుండడం, నిపుణులు అంచనా వేస్తున్న జులై–సెప్టెంబర్ నెలలు కూడా దగ్గరవుతుండడంతో సర్వత్రా ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ కొంచెం ఊరటనిచ్చే అంశం ఏంటంటే మృతుల శాతం తక్కువగా ఉండడం మాత్రమే.
అయితే ఈ వైరస్ వ్యాప్తి విసృతమైతే ఇప్పుడున్న మృతులశాతమే ఉంటుందన్న గ్యారెంటీలు కూడా ఎవ్వరి వద్దా లభించడం కష్టం. అత్యంత పరిశుభ్రతతో ఉండే పాశ్చాత్యదేశాలకంటే, అంతంత మాత్రం పారిశుద్ధ్యం ఉండే దేశాల్లో ఈ వైరస్ ప్రభావం తక్కువగానే ఉందన్నది ఇప్పటి వరకు వస్తున్న అంచనాలను బట్టి తెలుస్తోంది. అంటే వీలైనంతగా ప్రకృతికి దగ్గరగా ఉన్నవారు దేన్నైనా తట్టుకోగలిగే శక్తిని కలిగి ఉంటారన్న ప్రకృతి వైద్యులు చెబుతున్నది వాస్తవంగానే కన్పిస్తోంది. ఇక్కడి వారి రోగ నిరోధకశక్తి, వైరస్‌లో వచ్చిన మార్పుల నేపథ్యంలో మృతుల సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగానే కన్పిస్తోందన్నది భారతీయ నిపుణుల భావన. అయితే వైరస్ వ్యాప్తి విషయంలో మాత్రం అసింప్టమాటిక్ (ఎటువంటి వ్యాధిలక్షణాలు కన్పించకపోవడం) స్టేజ్‌లోనే ఎక్కువ మంది ఉంటున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఎటువంటి రోగ లక్షణాలు వీరికి ఉండవు, కానీ వీరు వైరస్‌ను వ్యాప్తి చేయగలుగుతారు.
దేశంలో కుటుంబ వ్యవస్థ నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు ప్రతి కుటుంబంలోనూ ఉంటారు. అసింప్టమాటిక్ రోగులు వైరస్‌ను విస్తృతంగా వ్యాప్తి చేస్తే చిన్నారులు, వృద్దుల ఆరోగ్య పరిస్థితీ ఏంటన్నదే ఆందోళన పెచుతున్న ప్రధానాంశం. ఈ కారణంగానే అనవసరంగా బైటకు వెళ్ళొద్దు అనే నినాదాన్ని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఒక వేళ ప్రతి రోజూ బైటకు వెళ్ళిరావాల్సిన అవసరమే ఉంటే, కుటుంబ సభ్యులతో కూడా భౌతిక దూరాన్ని పాటించడం ద్వారా ముందు జాగ్రత్త పడొచ్చన్నది నిపుణుల సూచనల్లో ఒకటిగా ఉంటోంది. బైటకు వెళ్ళాల్సి వస్తే భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, తరచు చేతులను శుభ్రం చేసుకోవడం అనే ప్రధాన జాగ్రత్తల విషయంలో ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్నా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందన్న విషయం స్పష్టమవుతోంది. ఇప్పుడు పెరుగుతున్న పాజిటివ్‌ల కంటే మున్ముందు రోజుల్లో సంఖ్య మరింతగా పెరిగేందుకు అవకాశం ఉందన్నది కాదనలేని విషయం.
బైట తిరిగిన గంటల సమయంలోనూ కేవలం ఒకటి రెండు నిముషాల నిర్లక్ష్యంతో చేసిన పని కూడా వైరస్ భారిన పడేసేందుకు అవకాశం ఉంటుంది. విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ తీరును గమనిస్తే ఇటువంటి నిర్లక్ష్యమే ప్రధానంగా ఉంటోందని చెప్పాలి. ప్రభుత్వాల చేసే హెచ్చరికలు పట్టించుకోకపోవడం, వద్దన్న పనులే చేయడం, ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకపోవడం వంటివి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యానికి తీవ్రంగా ముప్పు తెస్తున్నాయి. అదే సమయంలో సామాజిక, ఆర్ధిక ఇబ్బందులకు కూడా కారణమవుతున్నాయి. ఇప్పటి అంచనాలను బేరీజు వేసి భవిష్యత్తులో భారీగా కేసులు పెరుగుతాయని చెబుతున్నప్పటికీ.. భౌతికదూరం పాటించడం ద్వారా ఈ సంఖ్యను తగ్గించగలిగే అవకాశం ప్రజలపైనే ఉందని నిపుణులు చెబుతున్న మాట.