iDreamPost
android-app
ios-app

‘ప్రైవేటు’ సంక్షోభం

  • Published Sep 10, 2020 | 12:59 PM Updated Updated Sep 10, 2020 | 12:59 PM
‘ప్రైవేటు’ సంక్షోభం

ప్రభుత్వ ఉద్యోగాలకంటే కొన్ని పదులరెట్లు ప్రైవేటు ఉద్యోగాలు ఉంటాయి. రంగం ఏదైనా వ్యవసాయం తరువాత ఉపాధి కల్పించే రంగాల్లో అత్యధికశాతం మంది ప్రైవేటు ఉద్యోగులుగానే జీవితాలను కొనసాగిస్తున్నారు. అయితే కరోనా సంక్షోభం కారణంగా ఇప్పుడు ఆ ప్రైవేటు ఉద్యోగుల జీవితాలు కూడా సంక్షోభాన్నే ఎదుర్కొంటున్నాయన్నది సర్వేలు తేల్చిచెబుతున్న వాస్తవం. లాక్డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి ప్రైవేటు జాబ్‌మార్కెట్‌ను పరిశీలిస్తే.. గత ఏడు నెలలుగా ఉద్యోగాలు పూర్తిగా కోల్పోవడం గానీ, పేలాస్‌ సెలవుల పేరిట ఇళ్ళకు పంపడంగానీ జరిగింది.

పెద్ద స్థాయి ప్రైవేటు సంస్థలు సారీ చెప్పి శాలరీ అక్కౌంట్లు సెటిల్‌చేసి పంపించివేసాయి. కొన్ని మధ్యతరగతి, చిన్న స్థాయి కంపెనీలు మాత్రం ఉద్యోగులకు కొన్ని రోజుల డ్యూటీ, పనిచేసిన రోజులకే వేతనం విధానంలో కొనసాగిస్తున్నాయి. ఈ విధంగా చేస్తున్న సంస్థలు బహుతక్కువగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రానున్న కొన్ని నెలల పాటు ఉద్యోగ నియామకాలను గురించి పలు కంపెనీలు ఆలోచనే చేయడం లేదన్నది ఇప్పుడు నిరుద్యోగుల్లో ఆందోళన పెంచుతున్న అంశం. భవిష్యత్తు రోజులపై ఆశావహదృక్ఫథంతో ఉన్న నిరుద్యోగులకు ఇది అశనిపాతమే అవుతుంది.

మార్కెట్‌ మాయలో పడి వచ్చిన జీతాన్ని ఏ మాత్రం పొదుపు చేయకుండా ఖర్చు చేసేయడం అత్యధికశాతం మంది ఉద్యోగులకు అలవాటుగా అనేకంటే వ్యసనంగా మారిపోయింది. భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్ధిక ఇబ్బందులకు కొంత మొత్తం పొదుపు చేసే వాళ్ళను చూసి ఇటువంటి ఉద్యోగులు పరిహాసంగా చూసే పరిస్థితులు కూడా గతంలో పలువురికి అనుభవమే. అయితే ప్రస్తుతం ప్రైవేటు జాబ్‌మార్కెట్‌లో ఏర్పడ్డ సంక్షోభం కారణంగా ఇటువంటి నయా ప్రైవేటు ఉద్యోగులు తమతమ కుటుంబాలను పోసించుకోగలిగే స్థోమత సరాసరి మూడు నెలలు మాత్రమేనని మరోసర్వే స్పష్టం చేస్తోంది. అంటే మూడు నెలల తరువాత కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో వీరిదగ్గర తగిన సంసిద్థత లేదన్నమాట.

లక్ష రూపాయలు జీతం అందుకుంటున్నప్పటికీ నెల చివరలో ఖర్చుల కోసం క్రెడిట్‌కార్డులను ఆశ్రయించే వీరి అలవాటే ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొవాల్సిన పరిస్థితిని సృష్టించిదన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో రానున్న కొన్ని నెలల పాటు ఉద్యోగాల్లేకపోతే పెరిగిపోయే నిరుద్యోగం, తద్వారా ఏర్పడే విపరీత పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేశంలోని ఉద్యోగవర్గం సంసిద్ధంగా ఉందా? అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వం మేక్‌ఇన్‌ ఇండియా కార్యక్రమం ద్వారా విస్తృతమైన జాబ్‌మార్కెట్‌ను సృష్టించేందుకు అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే అందుకుతగ్గ మౌలిక వసతులు, ఇప్పటికిప్పుడు ఏర్పడిన అవసరాలకు సరిపడా నైపుణ్యం గల ఉద్యోగులు దొరుకుతారా అన్న సందేహాలు కూడా ఎదురవుతున్నాయి.

ప్రైవేటు రంగం తన అభివృద్ధిని మాత్రమే చూసుకుంటుందన్నది బహిరంగ వాస్తవం. తాను అభివృద్ధి చెందేందుకు ఉద్యోగులను ప్రోత్సహించడం, ఒక స్థాయిదాటి జీతభత్యాలు తీసుకునేవారి వదిలించుకోవడం అన్నది ప్రైవేటు వ్యవస్థకు పుట్టుకతో వచ్చిన విద్యే. ఈ నేపథ్యంలో ఒక వేళ అన్ని పరిస్థితులు చక్కబడి తిరిగి ఉద్యోగ నియామకాలు చేసే పరిస్థితులే ఏర్పడితే భారీ జీతభత్యాలు పొందేవారికి తిరిగి అంతే స్థాయి వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయా? అంటే కాదన్న సమాధానమే వస్తుంది. ఈ నేపథ్యంలో మరో యేడాది పాటు ఆయా కుటుంబాలకు తీవ్రమైన ఒడిదుడుకులు తప్పకపోవచ్చు అన్నదే సర్వేల సారాంశం. అందుకు తగ్గ ఏర్పాట్లతో సిద్ధంతా ఉండాల్సిందే తప్ప మరో మార్గం లేదన్నది నిరుద్యోగులకు ఇప్పటికే దాదాపు అర్ధమవుతోందనే చెప్పాలి.