కరోనా వైరస్ ఉధృతి ఇప్పుడు హైదరాబాద్ ని అల్లాడిస్తోంది. అందరినీ కలవరపెడుతోంది. చాలామందిని కంగారు పెడుతోంది. అనేక మంది ఈ పరిణామాల పట్ల ఆందోళనతో గ్రామాల బాట పడుతున్నారు. ఇప్పటికే వివిధ సంస్థల్లో వర్క్ ఫ్రమ్ హోం కొనసాగుతుండడంతో అనేక మంది సొంతూళ్లకు చేరిపోయారు. ఇంకా అనేకమంది అదే బాటలో ఉన్నారు. తాజాగా మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ వైపు సర్కారు ఆలోచన చేస్తుండడంతో పలువురు పల్లె వైపు చూస్తున్నారు. అటు తెలంగాణా గ్రామాలు, ఇటు ఏపీ లోని వివిధ ప్రాంతాలకు అనేక మంది వలసలు పోతున్నారు. తాత్కాలికంగా దానికనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అదే సమయంలో హైదరాబాద్ లో పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం మీడియాపై పడింది. ఇప్పటికే దాదాపు అన్ని పత్రిక, టీవీ కార్యాలయాల్లో సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఓ లెక్క ప్రకారం ప్రస్తుతం యాక్టివ్ కేసులుగా ఉన్న జర్నలిస్టుల లిస్టులో దాదాపు 120 మందికి పైగా ఉన్నారు. ఈ పరిణామాలతో అనేక మంది జర్నలిస్టులు తమ ఆఫీసులకు రావడానికి కూడా వణికిపోతున్నారు. కొందరి ఇళ్లల్లో కూడా ఒత్తిడి పెరుగుతోంది. బలిసి ఉంటే బలుసాకు తినవచ్చన్న మాటను పటిస్తున్నారు. దాంతో దాదాపుగా ఖాళీ అయిపోతున్న చానెళ్ల కార్యాలయాలు యాజమాన్యాలను ఆలోచనలో పడేస్తున్నాయి.
ఇప్పటికే ముంబైలో కరోనా కారణంగా కొన్ని టీవీ చానెళ్ల కార్యాలయాలు మూసి వేయాల్సి వచ్చింది. సిబ్బందికి ఒకేసారి పెద్ద సంఖ్యలో కరోనా సోకడంతో తమిళనాడులో కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నం అయ్యింది. తాజాగా ఇప్పుడు హైదరాబాద్ లో అలాంటి అనుభవం పునరావృతం కాబోతున్నట్టు అంతా భావిస్తున్నారు.
ఇప్పటికే కొన్ని చానెళ్లలో సబ్ ఎడిటర్లను వర్క్ ఫ్రమ్ హోం ప్రయత్నం లో పనిచేయిస్తున్నప్పటికీ స్టూడియో నుంచి కార్యకలాపాలు కోఆర్డినేట్ చేసేందుకు కూడా తగిన సంఖ్య ఆఫీసులో కనిపించడం లేదు. చివరకు తాత్కాలికంగా మూతేయాల్సిన పరిస్థితి ఎదురవుతుందా అనే అనుమానం కూడా బలపడుతోంది. చివరకు స్టూడియో డిస్కషన్స్ కూడా చాలామంది ససేమీరా అంటున్నారు. ఇళ్ల నుంచే వివిధ యాప్ ల ద్వారా టీవీ ఇంటర్వ్యూలు, ప్యానెల్ డిస్కషన్స్ చేయించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో వైరస్ ఇంకా విస్తృతం అయితే మీడియాకు ముప్పుతిప్పలు తప్పేలా కనిపించడం లేదు.
ఈ పరిణామాలను గ్రహించిన కొందరు యాజమాన్యాలు సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ విధులకు హాజరుకావాల్సిందేనంటూ కండీషన్స్ పెడుతున్నారు. విధులకు గైర్హాజరు కావడాన్ని సహించేది లేదంటూ కొన్ని చానెళ్ళ నుంచి సిబ్బందికి మెసేజ్ లు కూడా వచ్చాయి. అయిన్పటికీ అనేక మంది మొఖం చాటేస్తుండడంతో చివరకు ఎక్కడికి దారితీస్తుందో ఈ స్థితి అన్నది అంతుబట్టకుండా ఉంది.