iDreamPost
iDreamPost
కరోనా కలకలం రేపుతోంది. రోజువారీ సంఖ్యలో కేసులను గమనిస్తుంటే కొంత ఆందోళన కనిపిస్తోంది. కొన్ని పత్రికల్లో పెరిగిన నెంబర్లు చూపిస్తూ ప్రజల్లో మరింత అలజడి కలిగించే ప్రయత్నం చేయడం విశేషంగానే చెప్పాలి. కానీ రికవరీ రేటు గమనిస్తుంటే పూర్తి ఆశాజనకంగా ఉంది. ఇప్పటికే దేశంలోనూ, ఏపీలో కూడా అది మెరుగ్గా కనిపిస్తోంది. రోజువారీ కొత్త కేసులు గడిచిన వారం రోజులుగా ఏపీలో సగటున 9వేలు ఉంటే రికవరీ అవుతున్న కేసులు 10వేలకు పైనే ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
దానిని మించి ఇప్పుడు యాంటీ బాడీస్ వేగంగా వృద్ధి కావడం మరింత ఆశాజనకంగా మారుతోంది. ఇప్పటికే ఇలాంటి వారి సంఖ్య 25 శాతం ఉంటుందని చెబుతున్నారు. ఏపీలో సుమారు 5 కోట్ల మందిలో ఇప్పటికే కోటి మందిలో యాంటీ బాడీస్ వృద్ధి చెందినట్టు సర్వే చెబుతోంది. రాష్ట్రంలోని నెల్లూరు, కర్నూలు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ సర్వే సాగుతోంది. మరో రెండు రోజుల్లో నివేదిక రాబోతోంది. కానీ ఇప్పటికే అందుతున్న అంచనాల ప్రకారం యాంటీబాడీస్ వృద్ధి చెందిన వారి సంఖ్య 25 పైబడి ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి.
వివిధ రాష్ట్రాల్లో ఈ సెరాలజీ సర్వే సాగుతోంది. అందులో పూణే ముందంజలో ఉంది. అత్యధికంగా యాంటీ బాడీస్ అభివృద్ధిని వారి సంఖ్యను చూస్తే ఆ నగరంలో 51శాతం మంది ఉన్నట్టు చెబుతున్నారు. ముంబై మురికివాడల్లో 37 శాతం, ఒడిశా బరంపురంలో అది 31 శాతంగా నమోదయ్యింది. ఏపీలో కూడా కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. దాంతో కరోనా భయం ఉంచి క్రమంగా కోలుకోవచ్చని భావిస్తున్నారు.
మురికివాడల్లో ఈ యాంటీ బాడీస్ వృద్ధి చెందిన వారు ఎక్కువగా ఉన్నట్టు ఈ సర్వే నివేదికలు చెబుతున్నాయి. వారిలో 62 శాతం ఉండగా అపార్ట్ మెంట్ జీవితాల్లో 33 శాతం మందికి మాత్రమే యాంటీ బాడీస్ వృద్ది చెందినట్టు ప్రభుత్వం చెబుతోంది. యవసు ఆధారంగా చూస్తే 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉన్న వారిలో అది ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. లండన్ లాంటి మహానగరాల్లో ఇది 17 శాతం ఉండగా మనదేశంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉండడం ఆశావాహక పరిణామంగా వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది.