iDreamPost
iDreamPost
కోవిడ్ 19ను మనదేశంలో అరికట్టడంలో ఇప్పుడు ప్రజల చేతుల్లోకే మంచి అవకాశం వచ్చిందంటున్నారు నిపుణులు. ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినప్పటికీ వైరస్ మన దేశంలోకి వచ్చేయడంతో పాటు దాదాపు 77లక్షలకుపైగా జనాభాకు వ్యాపించేసింది. ఇక్కడి జనసాంద్రతతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గువగానే ఉండడానికి ప్రజలు, ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలేనంటే అతిశయోక్తి కాదు. అయితే రానున్న మూడు నెలలు కోవిడ్ వ్యాప్తికి కీలకం అవుతాయన్న అంచనాల నేపథ్యంలో మరోసారి ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తే వైరస్ వ్యాప్తిని సమర్ధవంతంగా నివారించగలుగుతామని వివరిస్తున్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా 6,95,509 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. దాదాపు 69,48,497 మంది కోవిడ్‌భారినుంచి కోలుకున్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.
అయితే రానున్న శీతాకాలం, పండగుల సీజన్‌లు నిపుణులను కలవరపెడుతున్నాయి. ఇతర దేశాల్లో ఇదే రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు కోవిడ్ 19 పాజిటివ్ కేసులు మరోసారి విజృంభించడాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. మన దేశంలోని ఢిల్లీ, కేరళల్లో సైతం ఇదే తరహాలో కేసులు పెరిగిపోవడాన్ని కూడా గుర్తించారు. ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్‌ను కట్టడి చేయడానికి ప్రజల పూర్తి సహకారం అవసరం అని పేర్కొంటున్నారు. సామాజికదూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పని సరిగా అమలు చేయాలని, ఇందు కోసం అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సాధారణంగా సీజనల్ వ్యాధులు సైతం శీతాకాలంలో విజృంభిస్తుంటాయి. ఇప్పుడున్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్‌కు కూడా శీతల వాతావరణం అనుకూలంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. జనం సమూహాలుగా చేరితే కోవిడ్ పాజిటివ్‌ల సంఖ్య పెరిగిపోతుందని అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసమూహాలకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దేశంలో కరోనా పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గుదల నమోదవుతున్నప్పటికీ రానున్న రోజులను బట్టి దీనిపై ఒక క్లారిటీ వచ్చేందుకు అవకావం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు.