iDreamPost
android-app
ios-app

టీవీ9లో ఏదో తేడా కొడుతోంది…

  • Published Oct 13, 2020 | 4:46 PM Updated Updated Oct 13, 2020 | 4:46 PM
టీవీ9లో ఏదో తేడా కొడుతోంది…

టీవీ9 చానెల్ వ్యవహారాలు ఇటీవల కాలంలో ఎన్నడూలేనంతగా చర్చనీయాంశాలవుతున్నాయి. సుమారు 14 ఏళ్ల పాటు రవిప్రకాష్‌ సారధ్యంలో నడిచిన చానెల్ ఏకఛత్రాధిపత్యం సాగించింది. తెలుగు మీడియాలో తిరుగులేని స్థానానికి చేరుకుంది. ఆక్రమంలో సాగించిన అనేక వ్యవహారాల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. టీవీ9 ధోరణిని తప్పుబట్టే వారు చాలామందే ఉంటారు. అయినప్పటికీ అటు రేటింగ్స్ లోనూ, ఇటు ప్రజాదారణలోనూ టీవీ9 టాప్ ప్లేస్ లో నిలిచింది.

కానీ ఇటీవల టీవీ9 కి ఆదరణ వేగంగా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. చాలాకాలం తర్వాత తొలిసారిగా గడిచిన వారంలో అగ్రస్థానం కోల్పోయింది. బార్క్ రేటింగ్ లో టీవీ9 తెలుగు చానెల్ రెండో స్థానంలో నిలిచింది. ఎన్టీవీకి సుదీర్ఘ విరామం తర్వాత మొదటి స్థానానికి చేరుకుంది. ఈ వారం కూడా అది నిలుస్తుందా లేదా అనేది సందేహమే. అయినప్పటికీ టీవీ9 అగ్రస్థానం కోల్పోవడంతో పాటుగా చానెల్ అంతర్గత వ్యవహారాలు కూడా ఇప్పుడు ఆసక్తిగా మారుతున్నాయి.

టీవీ9ని శ్రీనిరాజు అమ్మకానికి పెట్టిన తర్వాత మై హోమ్స్ రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి సంయుక్తంగా కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత తమ లక్ష్యాలకు అనుగుణంగా సిబ్బందిలో పలు మార్పులు చేశారు. ముఖ్యంగా రవి ప్రకాష్‌ అనుచరులు అనేకమందిని సాగనంపారు. సుదీర్ఘకాలంగా టీవీ9లో పాతుకుపోయి, తెలుగు మీడియాలో ఎక్కడా లేనంత మొత్తంలో వేతనాలు అందుకుంటున్న బ్యాచ్ ని బయటకు పంపించారు. అదే సమయంలో రజనీకాంత్ కి కూడా సెగపెట్టినట్టు ప్రచారం సాగింది. త్వరలో రజనీకాంత్ కి కూడా ఇంటి దారేనని అంతా భావించారు. టీవీ9 సిబ్బందిలో కూడా అదే అభిప్రాయం వినిపించింది.

కానీ అనూహ్యంగా రజనీకాంత్ కన్నా ముందు టీవీ9 సంస్థల డైరెక్టర్ గా ఉన్న సీఓఓ గొట్టిపాటి సింగారావు ఆ చానెల్ ను వీడినట్టు అందిన సమాచారం సిబ్బందిని ఆశ్చర్యపరిచింది. ఏడాదిన్నరగా చానెల్ వ్యవహారాలు చూస్తూ, అంతకుముందూ, ఇప్పుడు కూడా 10టీవీ నిర్వహణ కూడా తానే బాధ్యత తీసుకున్న సింగారావు హఠాత్తుగా టీవీ9ని వీడడం విశేషంగా భావిస్తున్నారు. ఏం జరిగిందోననే చర్చలు ఉధృతంగా సాగుతున్నాయి. పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్థిక కారణాలా లేక రాజకీయ కారణాలా అన్నది స్పష్టత లేకపోయినప్పటికీ సింగారావు మాత్రం టీవీ9 బాధ్యతల నుంచి తప్పుకోవడం ఆ చానెల్ ప్రస్థానం మీద కొత్త చర్చకు అవకశం ఇస్తోంది. రవి ప్రకాష్‌ అనంతరం పూర్తిగా స్థిరపడకుండానే మరోసారి బాస్ మారుతున్న తరుణంలో టీవీ9 భవితవ్యం ఎలా ఉంటుందోననే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇక రజనీకాంత్ సహా పలువురు సీనియర్ల సంగతి ఏమవుతుందోననే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.