iDreamPost
iDreamPost
అక్కడి సందర్భాన్ని బట్టి ఎమోషనల్ అవుతున్నారో లేక రేటింగ్స్ కోసం మంచి డ్రామా అవసరం కాబట్టి బిగ్ బాస్ నిర్వాహకుల సూచనల మేరకు ఓవర్ బరస్ట్ అవుతున్నారో తెలియదు కానీ మొత్తానికి నిన్న మాత్రం సభ్యులు పోటీపడి మరీ ఓవర్ యాక్షన్ చేసుకున్నారు. మొన్నటి ఎపిసోడ్ టాస్క్ కి కొనసాగింపుగా జరిగిన రోబోస్ vs హ్యుమన్స్ ఆట నిన్న వింత పోకడలు పోయింది. అరుచుకోవడాలు ఎక్కువయ్యాయి. తమ మీద ఆధిపత్యం చెలాయించడం భరించలేకపోయిన మెహబూబ్, సోహైల్, అఖిల్, మోనాల్ రోబోస్ టీమ్ మీద విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మెహబూబ్ అవసరానికి మించిన పెర్ఫార్మన్స్ ఇవ్వగా నేనేం తక్కువ తిన్నానా అనే స్థాయిలో సోహైల్ కూడా రెచ్చిపోయాడు.
ఒకదశలో సభ్యత మరిచిన బాష కూడా ఫుల్ గా వాడేశాడు. మెహబూబ్ సైతం ఇదే ధోరణి కొనసాగిస్తూ సెన్సార్ బీప్ అవసరమైన పదాలతో చిరాకు పుట్టించాడు. ఇక మోనాల్ తనకు సినిమాల్లో అవకాశాలు ఎందుకు రావట్లేదో ఋజువు చేసేందుకే అన్నట్టుగా పదే పదే ఏడుస్తూ విసుగుకి కేరాఫ్ అడ్రెస్ గా మారుతోంది. సానుభూతి కోసం ఆడుతున్న డ్రామా రివర్స్ అయ్యేలా ఉంది. దివి మీద అఖిల్ మాటల దాడి కూడా ఒకదశలో అవసరమా అనిపించే స్థాయిలో సాగింది. ఉన్నంతలో నోయల్ డీసెంట్ గా వ్యవహరిస్తూ చక్కదిద్ధేందుకు ప్రయత్నించాడు. సోహైల్ కూడా ఇదే తరహాలో అరియనాను లక్ష్యంగా చేసుకోవడం కనిపించింది. ఎదురుదాడి చేయడమే అజెండా పెట్టుకున్న ఇలాంటి టీమ్ మెంబెర్స్ తమ ఉద్దేశాలను నెరవేర్చుకున్నారు. నెగటివ్ పబ్లిసిటీ ద్వారా కూడా ఓట్లు తెచ్చుకోవచ్చనే స్కెచ్ కాబోలు.
ఇది ఈ రోజు కూడా కొనసాగనుంది. ఇలా ఒకే టాస్కుని రోజుల తరబడి సాగదీయడం కొత్తేమి కాదు కానీ రాను రాను ఇది మైనస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడు శనివారం వస్తుందా నాగార్జున ఎవరిని ఎలిమినేట్ చేసి పంపిస్తారా అని ఎదురు చూసేలా సాగుతోంది. ఈ షో వీరాభిమానులుకు నిన్న జరిగిన సంఘటనలు మసాలా ఎంటర్ టైన్మెంట్ కోణంలో నచ్చవచ్చేమో కాని సగటు ఆడియన్స్ మటుకు న్యూట్రల్ గా తీసుకునే తరహాలో సాగలేదు. అయితే ఇలాంటివి ఉంటేనే గేమ్ రక్తి కడుతుందనే వాళ్ళు లేకపోలేదు. లేకపోతే డ్రైగా సాగుతూ బోర్ కొట్టించే ఛాన్స్ ఉందనేది వాళ్ళ వెర్షన్. ఏది ఎలా ఉన్నా ఓవర్ ది లిమిట్ కొందరు సభ్యులు ఆడుతున్న తీరు మాత్రం బాలేదనే చెప్పాలి. ఇవన్నీ పరిగణించి వీకెండ్ లో నాగార్జున గట్టి క్లాస్ పీకే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి