iDreamPost
android-app
ios-app

కోర్టు ధిక్కార కేసుపై హైకోర్టులో మరోమారు విచారణ.. కీలక విషయం వెల్లడించిన సీఐడీ

కోర్టు ధిక్కార కేసుపై హైకోర్టులో మరోమారు విచారణ.. కీలక విషయం వెల్లడించిన సీఐడీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు వెల్లడించిన పలు తీర్పులను ఉద్దేశిస్తూ సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కోర్టు ధిక్కారం కింద నమోదైన కేసులో మరోమారు ఈ రోజు హైకోర్టు విచారణ జరిపింది. పోస్టులు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ హైకోర్టు కోరింది. ఇప్పటికే విచారణ పూర్తయిందని, ఛార్జీషీటు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ సీఐడీ అధికారులు హైకోర్టుకు తెలిపారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

సోషల్‌ మీడియాలో పలువురు పెట్టిన పోస్టులను కోర్టు ధిక్కారంగా పేర్కొంటూ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంలో ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్‌లలో వచ్చిన సమాచారం మేరకు రెండు దఫాలుగా 104 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో సహా పలువురు వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలు ఉన్నారు.