iDreamPost
android-app
ios-app

బాలుగారికి భారతరత్న ఇవ్వండి…ప్రధానికి జగన్ లేఖ

బాలుగారికి భారతరత్న ఇవ్వండి…ప్రధానికి జగన్ లేఖ

ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందిన గాన గంధర్వ శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్నకు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో జన్మించారని 16 భాషల్లో 40,000 కు పైగా పాటలు పాడారని, ఈ క్రమంలో ఆయనకు అనేక అవార్డులు లభించాయని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన పాడిన పాటలకు ఉత్తమ గాయకుడిగా 6 నేషనల్ ఫిల్మ్ అవార్డులు, 25 నంది అవార్డులు, 6 ఫిల్మ్ ఫేర్ సౌత్ ఇండియన్ అవార్డులతో పాటు తమిళ కన్నడ భాషల్లో అనేక అవార్డులు సాధించారని ముఖ్యమంత్రి జగన్ లేఖలో వెల్లడించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కళా రంగానికి చేసిన సేవలకు గాను 2001 లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులు భారత ప్రభుత్వం చేత పొందారని జగన్ తెలిపారు.

గతంలో కళా రంగానికి చేసిన సేవలకు గాను శ్రీమతి లతా మంగేష్కర్,శ్రీ భూపెన్ హజారిక, శ్రీమతి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి,శ్రీ బిస్మిల్లా ఖాన్,శ్రీ భీం సేన్ జోషిలకు భారత ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించిందని అలాగే బాలసుబ్రహ్మణ్యం సంగీతం మరియు కళలకు గత 50 సంవత్సరాలుగా చేసిన సేవలను పరిగణలోకి తీసుకుని ఆయనకు భారత అత్యున్నత పౌర పురస్కారం అయిన భారత రత్న అవార్డును బహుకరించాలని జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి మోడీకి లేఖ రాసారు.

బాలసుబ్రమణ్యానికి భారతరత్న కోరుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయటంపట్ల సంగీత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతరత్నకు బాలు అర్హుడని,కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు.