iDreamPost
android-app
ios-app

మంచు కరుగుతోంది – ముప్పు పెరుగుతుంది..

మంచు కరుగుతోంది – ముప్పు పెరుగుతుంది..

ప్రస్తుతం ప్రపంచాన్ని కలెవరపెడుతున్న సమస్య మంచు అనూహ్యంగా కరగడం…ప్రపంచం మొత్తం మీద నీటి శాతం 71% కాగా భూభాగం 29% అన్న విషయం తెలిసిందే. ఆ 71% నీటిలో 96.54% మహా సముద్రాలు, సముద్రాలు, అఖాతాల్లో నిక్షిప్తమై ఉండగా, మంచుకొండలు, ధృవాలు, హిమాని నదాల్లో 1.74 % నీరు నిక్షిప్తమై ఉంది. భూగర్భజలాలు 1.69%గా ఉంది. కాగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్,భూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయిన కాలుష్యం కారణంగా మంచు కొండలు ధృవాలు కరిగి సముద్ర నీటిమట్టం పెరుగుతుంది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు కాలుష్యం కారణంగా 1880 నుండి ఇప్పటివరకు సముద్ర మట్టం 8–9 అంగుళాలు (21–24 సెంటీమీటర్లు) పెరిగింది. సముద్రంలో క్రమక్రమంగా పెరుగుతున్న నీటి మట్టం ఎక్కువగా హిమానీనదాల వల్ల మరియు మంచు పలకల నుండి కరిగే నీటివల్ల పెరిగడం గమనించాల్సిన విషయం.

కలవరపెడుతున్న మంచు కరుగుదల

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు కాలుష్యం కారణంగా ధ్రువ ప్రాంతాలు మరియు మంచు పలకలు ఎక్కువగా కరుగుతున్నాయి. మంచు కరుగుదల ఎక్కువగా ఉండటంతో హిమాని నదాలు పొంగి ప్రవహిస్తున్నాయి. పెరుగుతున్న మంచు కరుగుదలపై ఇంగ్లండ్ లోని లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాలు కలవర పరిచే విషయాలను బహిర్గతం చేసాయి. ఉపగ్రహాలు సహాయంతో సుమారు 2.15 లక్షల మంచు ప్రాంతాల పరిస్థితిని లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. 1990 ల్లో ప్రతీ ఏటా 80,000 కోట్ల టన్నుల మంచు కరుగగా, 2017 నాటికి 1.3 లక్షల కోట్ల టన్నుల మంచు కరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలా పెరుగుతున్న మంచు కరుగుదల వల్ల పెంగ్విన్,ధృవపు ఎలుగుబంట్లు లాంటి జీవజాతులతో పాటు మానవ మనుగడ కూడా ప్రమాదంలో పడింది.

గతంతో పోలిస్తే 65% ఎక్కువగా మంచు కరిగిందని మంచు పలకలపై ఉష్ణ ప్రభావం ఎక్కువగా పడుతుందని లీడ్స్ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన థామస్ లేటర్ వెల్లడించారు. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ కూడా భూగోళంపై నిర్దేశించిన దానికన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. 1980 సంవత్సరం నుండి ప్రస్తుతం 0.26 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయని, సముద్రాల్లో 0.12 మేర ఉష్ణోగ్రత పెరిగిందని పరిశోధకులు తేల్చి చెప్పారు.. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కొండచరియలు విరిగిపడటం వల్ల హిమాని నదులు అకస్మాత్తుగా పొంగి ప్రవహిస్తున్నాయి. అందువల్ల ఎన్నో గ్రామాలు, పట్టణాలు ముంపుకు గురవుతున్నాయి. ఉత్తరాఖండ్ లో సంభవించిన వరదలకు హిమాని నదులు పొంగి ప్రవహించడానికి హిమాని నదులు ఎక్కువగా ప్రవహించడమే కారణం.

సముద్ర నీటిమట్టం పెరగడం వల్ల కలిగే నష్టాలు

సముద్ర మట్టాలు పెరగడం ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పుగా భావించవచ్చు. ఎందుకంటే సముద్ర మట్టంలో ఒక చిన్న పెరుగుదల కూడా లోతట్టు ప్రాంతాలు మరియు తీరప్రాంత ఆవాసాలపై వినాశకరమైన ప్రభావాలను కలిగిస్తుంది. సముద్ర మట్టం పెరగడం వల్ల భూమి కోతకు గురవుతుంది. అంతేకాకుండా చిత్తడి నేలలు ఏర్పడతాయి. ఉప్పు నీరు వ్యాపించడం వల్ల వ్యవసాయం నేలలు కలుషితమవుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా తీరప్రాంత నగరాల్లో నివసిస్తున్నారు. సముద్ర మట్టం పెరగడం కారణంగా సముద్రం భూప్రాంతంలోకి చొచ్చుకు వస్తుంది. అందువల్ల భవిష్యత్తులో తీర ప్రాంత నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. తద్వారా భూ పరివేష్టిత ప్రాంతం తగ్గిపోయి నీటి పరివేష్టిత ప్రాంతం పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే, లోతట్టు తీరప్రాంతాల్లో వరదలు తుఫానులు సంభవిమచినపుడు ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా లక్షలాది మంది వరద ప్రమాదం మరియు ఇతర వాతావరణ మార్పు ప్రభావాల వల్ల నష్టపోతున్నారు.

ముగింపు.

మనిషి ఎంతో అభివృద్ధి చెందాడు. అత్యున్నత ఆవిష్కరణలను కనిపెట్టాడు. ఎన్నో పరిశ్రమలను స్థాపించాడు. కానీ మనిషి చర్యల కారణంగా కాలుష్యం పెరిగి వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ధృవప్రాంతాలలో గ్రీన్ ల్యాండ్ అంటార్కిటికా ప్రాంతాల్లో మంచు ఎన్నడూ లేని విధంగా ప్రమాదకర స్థాయిలో కరుగుతుంది. వీటన్నింటి ప్రభావం వల్ల హిమాని నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దానివల్ల అపారమైన ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవిస్తుంది. తద్వారా సముద్ర నీటి మట్టం కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో సముద్ర నీటి మట్టం పెరగడం మానవ జాతి మనుగడపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కాబట్టి మనిషి రాబోయే ప్రమాదాన్ని గమనించి కాలుష్యాన్ని తగ్గించుకుని గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. లేకుంటే అనుకోకుండా సంభవించే తుఫానులు,వరదలకు కారణం అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు..