iDreamPost
iDreamPost
ఇంటా బయటా పెను సవాళ్లు ఎదుర్కొంటున్న కాంగ్రెస్.. సీనియర్ల ఒత్తిడికి తలొగ్గి వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహణకు సిద్ధమైంది. ఈ నెల 16న సీడబ్ల్యూసీ మీటింగు ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కుమ్ములాటలు, జీ-23 నేతల ఒత్తిళ్లు, సంస్థాగత ఎన్నికలు నిర్వహించకపోవడం, పార్టీ నుంచి పెరిగిన నేతల వలసలు తదితర అంశాలపై సమావేశంలో వాడీవేడి చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికతోపాటు పార్టీలో సమూల మార్పులకు జీ-23లో సభ్యులుగా ఉన్న సీనియర్ నేతలు పట్టుబట్టే అవకాశం ఉంది.
20 ఏళ్లుగా జరగని సీడబ్ల్యూసీ ఎన్నికలు
పార్టీ నియమావళి ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను ఎన్నిక ద్వారా నియమించాలి. కానీ గత రెండు దశాబ్దాలుగా ఆ ఎన్నికల ఊసే లేదు. చివరిసారిగా 1998లో ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత నుంచీ నామినేషన్ ద్వారా నియామకాలు జరుపుతున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలతో పాటు సీడబ్ల్యూసీ ఎన్నికలు నిర్వహించాలని 2017లోనే కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆదేశించింది. కానీ ఇంతవరకు నిర్వహించలేదు. అలాగే పార్టీ అధ్యక్ష ఎన్నిక సైతం జరక్కపోవడంతో రెండేళ్లకుపైగా సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా నెట్టుకొస్తున్నారు. జనవరి 22న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో జూన్ నాటికి అధ్యక్ష ఎన్నిక పూర్తి చేస్తామని చెప్పారు. అయితే కోవిడ్ కారణంగా ఇప్పట్లో నిర్వహించలేమని మే 10 తేదీన జరిగిన సమావేశంలో వెల్లడించారు. ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. 16తేదీన జరిగే సమావేశంలో అసంతృప్త నేతలు అధ్యక్ష ఎన్నికనే ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది.
Also Read : కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మంత్రి యశ్ పాల్ ఆర్య
డిమాండ్లు నెరవేరేనా
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత నుంచి పార్టీ నాయకత్వంపై అసమ్మతి మొదలైంది. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా నెట్టుకురావడం.. మళ్లీ రాహుల్ కే పగ్గాలు అప్పగించడానికి ప్రయత్నాలు జరగడాన్ని సీనియర్ నేతలు తప్పుపట్టారు.23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు జీ- 23 పేరుతో సోనియాకు లేఖ రూపంలో తమ అసంతృప్తిని డిమాండ్‌ల ద్వారా వెల్లడించారు. గాంధీ కుటుంబ నాయకత్వం నుంచి పార్టీని తప్పించాలన్నది వారి ప్రధాన డిమాండ్.సమర్ధుడైన నాయకుడిని ఎన్నుకోవాలని,సంస్థాగత ఎన్నికలు నిర్వహించి పార్టీలో సమూల మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవలి కాలంలో పార్టీ నుంచి పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతుండటం, అధికారంలో ఉన్న పంజాబ్,ఛత్తీస్‌ఘడ్,రాజస్థాన్ రాష్ట్రాలలో పార్టీ అంతర్గత కలహాలకు హైకమాండ్ వైఫల్యమే కారణమని జీ- 23 నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ ప్రకటించిన నేపథ్యంలో వారం క్రితం సీనియర్ నేత కపిల్ సిబల్ బహిరంగంగానే హైకమాండ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి అధ్యక్షుడు లేరు.. నిర్ణయాలు ఎవరు టీసుకుంటున్నారో తెలియడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరో సీనియర్ నేత నట్వర్ సింగ్ అయితే.. పార్టీలో ఏ హోదా లేని వారు నిర్ణయాలు తీసేసుకుంటున్నారని విమర్శించారు. సమస్యలు,సవాళ్లపై చర్చించేందుకు వెంటనే సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీడబ్ల్యూసీ సభ్యుడు గులాం నబీ ఆజాద్ సోనియాకు పది రోజుల క్రితం లేఖ రాశారు. నలువైపుల నుంచీ ఒత్తిళ్లు పెరగడంతో సీడబ్ల్యూసీ సమావేశానికి ఎట్టకేలకు ముహూర్తం నిర్ణయించారు. మరి కీలక డిమాండ్ అయిన అధ్యక్ష ఎన్నిక,పార్టీ సంస్థాగత మార్పులపై ఇందులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read : యూపీ కాంగ్రెస్‌లో ఆశలు రేపుతున్న ప్రియాంక