iDreamPost
iDreamPost
అవును.. ఇది నిజం. కాంగ్రెస్ తో టీడీపీ మరోసారి పొత్తు పెట్టుకుంటోంది. 2019లో పరోక్షంగా పొత్తుపెట్టుకుంది. ఈసారి ప్రత్యక్షంగా కలిసి సాగుతోంది. టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఉమ్మడిగా 2019 ఎన్నికల్లోనే ప్రచారం చేయగా, ఇప్పుడు ఉమ్మడిగా సీట్లు కూడా పంచుకున్నారు. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ లో కాదు. అండమాన్ దీవుల్లో. అదేంటి అక్కడ కూడా టీడీపీ ఉందా అనుకుంటున్నారు. ఆపార్టీ అధినేత చంద్రబాబు జాతీయ అధ్యక్షుడినని చెప్పుకోవడానికి తగ్గట్టుగా అండమాన్ లో టీడీపీ యూనిట్ అప్పట్లోనే ఏర్పాటు చేశారు. ఏపీలో అధికారంలో ఉండగా, తెలుగు రాష్ట్రాల నుంచి వలస వెళ్లిన వారిని సమీకరించి అక్కడ పార్టీ విస్తరించిందని ప్రకటించారు. ఇప్పుడు అండమాన్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి సాగేందుకు అనుమతించారు.
చంద్రబాబు గత మహానాడులో బీజేపీకి ప్రేమలేఖలు పంపించారు. బేషరతుగా కేంద్రానికి మద్ధతు ప్రకటించారు. అంశాల వారీగా అండగా ఉంటామని వెల్లడించారు. అదంతా బీజేపీ నేతలు అడగకుండా, వారు స్పందించకపోయినా మద్ధతు తెలిపారు. అదే సమయంలో బీజేపీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇదంతా ఓవైపు జరుగుతుండగానే ఇంకోవైపు టీడీపీ నేతలు కాంగ్రెస్ తో చేతులు కలపడం, దానికి చంద్రబాబు ఆమోదం దక్కడం చూస్తుంటే రెండు కళ్ల సిద్ధాంతం కొనసాగిస్తున్నారని స్పష్టమవుతోంది. ఎటు వీలుంటే అటు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహారం ఉంటుందనే ప్రచారానికి తగ్గట్టుగా ఉన్నట్టు కనిపిస్తోంది.
అండమాన్ మునిసిపల్ ఎన్నికల్లో డీఎంకే, అన్నా డీఎంకేలు కూడా పోటీ చేస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ , టీడీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. అండమాన్ అండ్ నికోబార్ దీవుల పీసీసీ అధ్యక్షుడు రంగనాథ్ హల్దార్, టీడీపీ అధ్యక్షుడు మాణిక్య యాదవ్ మధ్య ఈ పొత్తుకి సంబంధించి ఒప్పందం కుదిరింది. మార్చి 6వ తేదీన జరగబోయే ఈ ఎన్నికల్లో టీడీపీ మూడు వార్డులకు పోటీ చేస్తుంది. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ కి మద్ధతునిచ్చింది. ఉమ్మడిగా కృషి చేసి ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయా నేతలు వెల్లడించారు.
ఏపీలో కూడా మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ అనేక పార్టీలతో ఒప్పందం పెట్టుకుంది. జనసేన, బీజేపీ, లెఫ్ట్ పార్టీలను కూడా కలుపుకుని పోటీ చేసింది. కానీ ఆశించిన ఫలితాలు దక్కకపోవడం ఢీలా పడింది. కేవలం దర్శి మినహా మరెక్కడా టీడీపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. దాంతో ఆపార్టీ సొంత గడ్డ మీద కుంగిపోయింది. అదే సమయంలో అండమాన్ లో మాత్రం సత్తా చాటుతామంటూ పొత్తులతో కాంగ్రెస్ వెంట సాగుతుండడం రాజకీయంగా కీలక పరిణామంగా భావించాలి.
Also Read : టీడీపీ కూడా గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేస్తుందా?