Idream media
Idream media
అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగోయ్(85) బహుళ అవయవ వైఫల్యంతో ఇవాళ సాయంత్రం మరణించారు. గత ఆగస్టు 25న గొగోయ్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనని గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ప్లాస్మా థెరఫీ చికిత్సతో కరోనా మహమ్మారిని జయించి సరిగ్గా రెండు నెలల అనంతరం అక్టోబర్ 25న హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే కరోనా అనంతర సమస్యలతో ఆయన శరీరంలోని పలు అవయవాల పనితీరు క్షీణించింది. ఈ నేపథ్యంలో నవంబర్ 2న తిరిగి గువాహటి వైద్య కళాశాలలో చేరిన గొగోయ్ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభం ఉన్న తరుణ్ గొగోయ్ ఏప్రిల్ 1, 1936న సంప్రదాయ అస్సామీ తై అహోం కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి డాక్టర్ కమలేశ్వర్ గొగోయ్ రంగజన్ టీ ఎస్టేట్‌లో మెడికల్ ప్రాక్టీస్ చేసేవారు. తల్లి ఉషా గొగోయ్ “హియార్ సమాహార్ (హార్ట్ ట్రెజర్స్)” అనే కవితా సంపుటితో ప్రసిద్ధి చెందిన కవియిత్రి.
తరుణ్ గొగోయ్ ప్రాథమిక విద్యను రంగజన్ నిమ్నా బునియాడి విద్యాలయంలో ప్రారంభించాడు. 1949 లో గోగోయ్ జోర్హాట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి హెచ్ఎస్ఎల్‌సీ (HSLC) పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అస్సాంలోని ప్రతిష్టాత్మక జగన్నాథ్ బరూవా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తరువాత అస్సాంలోని గువాహటి విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు.1972లో గువాహటి యూనివర్సిటీ నుండి జువాలజీలో పిజి పూర్తి చేసిన డాలి గొగోయ్‌ను వివాహం చేసుకున్నాడు.
రాజకీయ ప్రస్థానం:
1968లో జోర్హాట్ మునిసిపల్ బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తరుణ్ గొగోయ్ ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన తొలిసారి 1971లో జోర్హాట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున లోక్‌సభలోకి అడుగుపెట్టారు. తరువాత అదే నియోజకవర్గం నుండి వరుసగా 6వ,7వ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించాడు. 1986-91 మధ్య అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. 1991 సాధారణ ఎన్నికలలో కాలియాబోర్ నుండి లోక్‌సభకి ఎన్నికైన ఆయన 1998,1999 ఎన్నికలలో కూడా అదే స్థానం నుండి విజయం సాధించారు. ప్రస్తుతం అతని కుమారుడు గౌరవ్ గొగోయ్ కాలియాబోర్ నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు.
1976లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన తరువాత గోగోయ్ జాతీయ స్థాయి రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. తరువాత ఆయన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో 1985-90 మధ్య ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో (1991-95) ఆహార మంత్రిత్వ శాఖ మరియు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రిత్వ శాఖకు స్వతంత్ర హోదాలో సహాయ మంత్రిగా పనిచేశారు. ఇక 1996లో గొగోయ్ తిరిగి రెండవసారి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.ఆ సమయంలో ఆయన 1996-98లో శాసనసభలో మార్గరీటా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.
2001 అసెంబ్లీ ఎన్నికలలో టైటాబార్ నుండి విజయం సాధించిన గొగోయ్ అసోం ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టాడు. తరువాత వరుసగా 2006, 2011 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి విజయాలు సాధించి పెట్టి ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగారు. దీనితో ఆయన వరుసగా మూడుసార్లు 2001-2016 వరకు 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. అసోంలో సుదీర్ఘకాలంపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా గొగోయ్ రికార్డు నెలకొల్పారు. 2016 అసోం అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, ఇతర పార్టీలతో కలసి కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారాన్ని చేపట్టింది. కానీ తరుణ్ గొగోయ్ మాత్రం తితాబార్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలుపొంది ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగుతున్నారు.
కోవిడ్ మహమ్మారి బారిన పడటానికి ముందు వరకు కూడా తరుణ్ గొగోయ్ అసోం రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో అధికార బిజెపి ఓటమికి కంకణ బద్ధుడైన గొగోయ్ ప్రతిపక్ష పార్టీలన్నింటిని కలుపుకుని ‘గ్రాండ్ అలయన్స్’ ఏర్పాటు చెయ్యడంలో కీలకపాత్ర వహించారు. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా చెప్పవచ్చు.